Parliament timings: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటినుంచి పాత విధానంలోనే కొనసాగనున్నాయి. దీంతో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకే ఉభయ సభలు ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారికి ముందు జరిగినట్టుగానే పార్లమెంట్ సమావేశాలను ఏకకాలంలో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పలు పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు రాజ్యసభ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యురాలు వందనా చౌహాన్ సోమవారం మధ్యాహ్నం తెలిపారు. రాజ్యసభ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగుతుందని వెల్లడించారు. సభ్యులు రాజ్యసభ గ్యాలరీలో మాత్రమే కూర్చుంటారని చౌహాన్ పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో రాజ్యసభ, లోక్ సభ సమావేశాల సమయంలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సభ్యుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు రేపటినుంచి సభ పూర్తి స్థాయిలో జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం చౌహాన్ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.
ఈ రోజు నుంచి ప్రారంభమైన పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఉదయం నుంచి వాయిదాల పర్వం కొనసాగింది. చమురు, వంటగ్యాస్ ధరల పెంపుపై రాజ్యసభలో విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఉదయం నుంచి మూడు సార్లు వాయిదా పడింది. సభలో సభ్యుల ఆందోళన కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
కోవిడ్ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయాల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు లోక్‌సభను నిర్వహిస్తూ వచ్చారు. జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021-22 ను ప్రవేశపెట్టారు. పార్లమెంట్ మొదటి విడత సమావేశాలు 29 వరకూ జరిగాయి. ఈ క్రమంలో రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8తో ముగియనున్నాయి. కాగా.. పార్లమెట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలను కుదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. హోలీకి ముందే ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: