Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. రాష్ట్రపతి ఆమోదం కోసం..

యాంటీ పేపర్ లీక్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా తాజాగా ఆమోదం లభించింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి దీనిని పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్లు అమల్లోకి రానుంది. ఇటీవల నీట్ పేపర్ లీక్ అయిన క్రమంలో కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది.

Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. రాష్ట్రపతి ఆమోదం కోసం..
Rajyasabha

Updated on: Jul 30, 2026 | 9:46 PM

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలపగా.. తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో రెండు ఉభయ సభల్లోనూ ఆమోదం లభించినట్లు అయింది. పరీక్షా పత్రాల లీకేజీలలో పాల్గొన్న వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షలను విధించనున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టాన్ని సవరించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత.. ప్రతిపక్ష సభ్యుల అంతరాయాలు, వాకౌట్ మధ్య రాజ్యసభ గురువారం పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. విద్యార్థులు, యువత  ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది ఒక నిదర్శనమని కేంద్రం చెబుతోంది.

కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ రోజు ఉదయం రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026 (యాంటీ-పేపర్ లీక్ చట్టం)ను ప్రవేశపెట్టారు. బిల్లును ఆయన ప్రవేశపెడుతూ.. పదేపదే అంతరాయాలు కలిగినప్పటికీ దాదాపు 10 గంటల చర్చ అనంతరం లోక్‌సభలో ఇది ఇప్పటికే ఆమోదం పొందిందని అన్నారు. “మనందరికీ తెలిసినట్లుగా ఈ బిల్లు దిగువ సభలో ఆమోదం పొందింది. అక్కడ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. తరచుగా అంతరాయాలు కలిగినా, పూర్తి సమాధానం గందరగోళంలోనే చెప్పాల్సి వచ్చినా చర్చ జరిగింది. ఇప్పుడు ఈ బిల్లు ఎగువ సభకు వచ్చింది. పెద్దల సభ, సీనియర్ల సభ, వివేకవంతుల సభ, పరిణతి చెందిన వారి సభ. ఈ దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత నిబద్ధతకు యాంటీ-పేపర్ లీక్ బిల్లు ఒక పునరుద్ఘాటన” అని మంత్రి అన్నారు.

కాగా నీట్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు జరిపిన నిరసనల కారణంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే.. కేంద్రం సోమవారం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలో పాలుపంచుకున్న వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానాతో సహా కఠినమైన శిక్షలను ఈ చట్టంలో పొందుపర్చింది. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్షాలు నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us