రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూడ్ రిలీజైంది. ఖాళీ అయిన 12 స్థానాలకు షెడ్యూల్ విడులైంది. తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3 న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 26-27 గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 14న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఎన్నికల పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ అని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికైన తర్వాత పది స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతోపాటు సభ్యులు రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. 12 సీట్లలో.. అస్సాం, బీహార్, మహారాష్ట్ర నుంచి రెండు చొప్పున.. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఒడిశా నుంచి ఒకటి చొప్పున సీట్లు ఉన్నాయి.. ఈసీ ప్రకటన ప్రకారం, ప్రతి రాజ్యసభ స్థానానికి వేర్వేరుగా సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
ఇదిలాఉంటే.. రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో తెలంగాణలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి.. ఇటీవలె కాంగ్రెస్‌లోకి వెళ్లిన కే కేశవరావు (కేకే).. పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడా ఒక్క స్థానమే హాట్ టాపిక్‌గా మారింది. కేకే స్థానంలో ఎవరికి ఆ సీటును కేటాయిస్తారు..? సీనియర్లకు ఛాన్స్ ఇస్తారా..? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది…? అసలు హైకమాండ్ మదిలో ఏముంది..? అన్న అంశాలపై చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఏఐసీసీ అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్‌మను సింఘ్వీకి ఆ సీటు ఇవ్వడం ఖాయమంటూ తెగ ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఆయనకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికలో అభిషేక్ సింఘ్వీ అనుకోకుండా ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను మరో చోట నుంచి పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..