మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ భేటీ రద్దు

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2020 | 12:31 PM

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. మాస్కోలో . చైనా డిఫెన్స్ మినిస్టర్ వీ ఫెంగీతో భేటీ కావడంలేదని చైనాకు చెందిన కొన్ని వెబ్ సైట్లు తెలిపాయి. లదాఖ్ లోని గాల్వన్ వ్యాలీలో ఇటీవల ఉభయ దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తతలు..

మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ భేటీ  రద్దు
Follow us on

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. మాస్కోలో . చైనా డిఫెన్స్ మినిస్టర్ వీ ఫెంగీతో భేటీ కావడంలేదని చైనాకు చెందిన కొన్ని వెబ్ సైట్లు తెలిపాయి. లదాఖ్ లోని గాల్వన్ వ్యాలీలో ఇటీవల ఉభయ దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగి ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. రాజ్ నాథ్ చైనా రక్షణ మంత్రితో భేటీ కావచ్ఛునని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం లేనట్టేనని ఆ వెబ్ సైట్లు పేర్కొన్నాయి. అటు-ఢిల్లీలోని రక్షణ శాఖ వర్గాలు కూడా.. వారు  సమావేశమయ్యే ప్రసక్తి లేదని, భేటీ అవుతారని వచ్చిన వార్తలు నిజం కావని స్పష్టం చేశాయి. రష్యా 75 వ ‘విక్టరీ డే పరేడ్’ ని పురస్కరించుకుని రాజ్ నాథ్ సింగ్ నిన్న మాస్కో చేరుకున్నారు. ఆయన మూడు రోజులపాటు ఈ దేశంలో పర్యటించనున్నారు. బుధవారం మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఆయన.. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఈ దేశం నుంచి ఎస్.40 యాంటీ మిసైల్ సిస్టం ని ఇండియా అనుకున్న సమయానికన్నా ముందే పొందగలదని ఆశిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ఈ సిస్టం భారత దేశానికి చేరడంలో జాప్యం జరిగిందని అన్నారు. ఇండో-చైనా దేశాల మధ్య రేగిన ఉద్రిక్తతల గురించి  తను ఈ దేశ డిప్యూటీ పీఎంతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తానని, ఇండియా శాంతి కాముక దేశమని, పరాయి దేశ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంక్షించబోదని స్పష్టం చేస్తానని రాజ్ నాథ్ వెల్లడించారు.

ఇలా ఉండగా.. ఇండియా-చైనా బోర్డర్ వ్యవహారాలపై గల వర్కింగ్ మెకానిజం కమిటీ.. రెండు దేశాల బోర్డర్ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించవచ్చునని తెలుస్తోంది. రెండు పక్షాల నుంచి జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. బోర్డర్ ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు 2012 లోనే ఈ కమిటీ ఏర్పాటైంది.