
రాజస్థాన్, ఫిబ్రవరి 18: రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా కరాలియాలోని పాలి గ్రామంలో పరమవీర్ రాథోడ్ (30) ఫిబ్రవరి 14న జైసల్మేర్‌లోని కరాలియా గ్రామంలో నికితా భాటి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుక సమయంలో మండపానికి వచ్చినప్పుడు, వధువు కుటుంబం అతనికి ఘన స్వాగతం పలికింది. పెళ్లి వేడుకలో భాగంగా ‘తిలక్’ ఆచారం జరిపించారు. అందులో వరుడికి అలంకరించబడిన పళ్ళెంలో రూ. 5,51,000 బహుకరించారు. వారు నాకు డబ్బును పెళ్లెంలో పెట్టి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, వెంటనే వరుడు రోథోడ్ వారిని అడ్డుకున్నాడు. కట్నం ఆచారాలు సమాజంలో ఇంకా కొనసాగుతున్నాయనే విషయం తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు. వెంటనే వరుడు తన తండ్రితో, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కట్నం డబ్బును మొత్తం తిరిగి ఇవ్వాలి కోరాడు. ఆ ప్రకారంగానే అతడి కుటుంబం మొత్తం డబ్బును ఇచ్చేశారు.
రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సివిల్ సర్వీసెస్ ఆశావహుడిని. ఉన్నత చదువులు చదివిన నేను, నాలాంటి వారు మార్పు తీసుకురాకపోతే ఎవరు మార్పు తీసుకువస్తారని నేను నా పెళ్లి సమయంలో భావించాను. అందుకు నేనే ఒక ఉదాహరణగా నిలవాలని అనుకున్నాను. నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని అంగీకరించి నాకు మద్దతు ఇచ్చారు. నాకు ఒక సోదరి కూడా ఉంది. ఈ దురాచారాలను మనం అంతం చేయకపోతే, సమాజంలో మార్పు ఎలా తీసుకువస్తాం? మనలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట ప్రారంభించాలి. అవును.. ఇది అకస్మాత్తుగా జరగదు కానీ మనం ఎక్కడో ఒక చోట ప్రారంభించాలి’ అంటూ స్ఫూర్తి దాయకంగా మాట్లాడి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.
ఇక రాథోడ్ తండ్రి ఈశ్వర్ సింగ్ కూడా ఇదే విధమైన భావాలను ప్రతిధ్వనిస్తూ మాట్లాడారు. తన కుమారుడి పెళ్లి తంతులో భాగంగా ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి నాణెం మాత్రమే స్వీకరించినట్లు, వధువు తరపు బంధువులు ఇచ్చిన మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు తెలిపారు. ఈ వరకట్న ఆచారాన్ని మనమే ఆపాలి అని నినదించారు. చేతిదాకా వచ్చిన డబ్బును కాదనుకోవడానికి కూడా ధైర్యం కావాలి. కట్నం నిరాకరించడానికి ఎంతో ఉన్నతమైన సంస్కారం ఉండాలి. ఈ రెండూ రాథోడ్‌లో నిండుగా ఉన్నాయనడానికి ఇంతకంటే ఏం రుజువు కావాలి?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.