AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీరని దుఃఖం.. చెరువులో మునిగిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి ముగ్గురు మహిళలు దుర్మరణం!

రాజస్థాన్‌ ధోల్‌పూర్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగిన బాలుడిని రక్షించే ప్రయత్నంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నలుగురు జలసమాధి అయ్యారు. ఆలయ దర్శనం తర్వాత జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తీరని దుఃఖం.. చెరువులో మునిగిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి ముగ్గురు మహిళలు దుర్మరణం!
Rajasthan Drowning Tragedy
Balaraju Goud
|

Updated on: Aug 30, 2026 | 11:57 AM

Share

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరమథుర ప్రాంతంలోని ఆంగై పోలీస్ స్టేషన్ పరిధిలోని ధోధ్-బిర్జా గ్రామం సమీపంలో చెరువులో మునిగి ముగ్గురు మహిళలు, ఒక బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధోల్‌పూర్‌లోని మొరోలీ గ్రామానికి చెందిన కొందరు మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి బిర్జా గ్రామంలోని హిరామన్ బాబా ఆలయానికి పూజల కోసం వెళ్లారు. ఆలయ దర్శనం అనంతరం చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపడిపోయాడు. బాలుడు నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన ముగ్గురు మహిళలు అతడిని రక్షించేందుకు చెరువులోకి దిగారు. అయితే నీటి లోతు, పరిస్థితుల కారణంగా వారు కూడా అదుపుతప్పి నీటిలో మునిగిపోయారు. క్షణాల్లోనే పరిస్థితి విషాదంగా మారింది.

బాలుడితో పాటు ముగ్గురు మహిళలు నీట మునిగారు. సమాచారం అందుకున్న వెంటనే ఆంగై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించారు. రెస్క్యూ బృందాలు చెరువులో గాలింపు చేపట్టి ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశాయి. మరోవైపు బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులను మొరోలీ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఘటన విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకున్నారు. తమ కళ్ల ముందే జరిగిన ఈ విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఒక బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, చెరువులో నీటి లోతు తదితర అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us