రాజస్తాన్ లో రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ నాయకులు సంజయ్ జైన్, భన్వర్ లాల్ శర్మ, గజేంద్ర సింగ్ ల పై పార్టీ చీఫ్ విప్ మహేంద్ర జోషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వీరు కుట్ర పన్నారని, వీరిపై దేశద్రోహ ఆరోపణలు మోపి ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలని ఆయన కోరారు. ఓ ఆడియో టేపు రికార్డింగ్ లో వీరి నిర్వాకం బయట పడిందన్నారు. ఈ ఆడియో టేపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేల బేర సారాలకు సంబంధించి సంజయ్ జైన్ గొంతు ఈ ఆడియోలో స్పష్టంగా వినిపించిందట. దీంతో రాజస్థాన్ పోలీసు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంజయ్ జైన్ ని అరెస్టు చేసి రెండు రోజులపాటు ఇంటరాగేట్ చేసింది. కాగా జైన్ ని బీజేపీ నాయకునిగా కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించగా దీన్ని బీజేపీ తొసిపుచ్చింది.