Rahul Gandhi: రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. యూపీ హైవేపై ఢీకొన్న కాన్వాయ్

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిబ్బందికి గాయాలయ్యాయి.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. యూపీ హైవేపై ఢీకొన్న కాన్వాయ్
Rahul Gandhi

Updated on: Oct 26, 2026 | 11:30 AM

యూపీలో రాహుల్‌గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. కాన్వాయ్‌లోని 5కార్లు, ఒక అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని రాహుల్ భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.  ఈ ఘటనలో రాహుల్ గాంధీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  ఈ ప్రమాదంలో కాన్వాయ్‌లోని వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా.. ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుండి రాహుల్ గాంధీ పూర్తిగా క్షేమంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు, కాన్వాయ్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అయితే కాన్వాయ్ వేగంగా వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక హలియాపూర్ పోలీసులు.. వెంటనే ఆఘమేఘాల మీద ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన సిబ్బందిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా ఎక్స్‌ప్రెస్ వేపై  కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. లక్నో విమానాశ్రయం నుండి  సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో జరుగుతున్న విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షాపై రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న గాంధీపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోండగా..  2024 ఫిబ్రవరిలో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో వాదనలు అక్టోబర్ 6న ప్రారంభమవ్వగా.. అక్టోబర్ 12న ముగిశాయి. అక్టోబర్ 26 మధ్యాహ్నం కోర్టు తీర్పును వెలువరించనుంది. దీంతో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ వస్తున్న క్రమంలో కోర్టు ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు సిబ్బంది భారీగా మెహరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us