జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బాంబుల తయారీకోసం ఆన్ లైన్ లో కెమికల్స్ వగైరా వస్తువులను కొనుగోలు చేసిన ముఠాలోని మరో ఇద్దరిని ఎన్ ఐ ఏ (జాతీయ దర్యాప్తు బృందం) అరెస్టు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ బాంబులను వినియోగించి ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా శ్రీనగర్ కు చెందిన 19 ఏళ్ళ వైజుల్ ఇస్లామ్ అనే యువకుడిని, పుల్వామాకు చెందిన 32 ఏళ్ళ మహమ్మద్ అబ్బాస్ రాథేర్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. దీంతో గత వారం రోజుల్లో అరెస్టయినవారి సంఖ్య ఐదుకు చేరింది. బాంబుల తయారీ కోసం కెమికల్స్, బ్యాటరీలు, ఇతర వస్తువులను సేకరించేందుకు తాను అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ అకౌంట్ ను వినియోగించానని వైజుల్ ఇస్లామ్ అంగీకరించాడట. పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ టెర్రరిస్టుల నుంచి అందిన ఆదేశాల మేరకు వీటిని కొనుగోలు చేసినట్టు ఆ యువకుడు చెప్పాడు. దాడిలో భాగంగా వీటిని పర్సనల్ గా తాను వారికి అంద జేసినట్టు ఇస్లామ్ తెలిపాడు. ఇక మహమ్మద్ అబ్బాస్ కూడా తక్కువైనవాడేమీ కాదు. జైషే మహమ్మద్ కి చెందిన ఓ టెర్రరిస్టుకు, బాంబుల తయారీలో నిపుణుడైన మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తి కి 2018 ఏప్రిల్-మే నెలల్లో ఇతగాడు తన ఇంట్లో ఆశ్రయం కల్పింఛాడట. ఇంకా అదిల్ అహ్మద్ దార్ అనే సూసైడ్ బాంబర్ కి, సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్ అనే ఉగ్రవాదులకు కూడా అతడు షెల్టర్ ఇఛ్చినట్టు ఒప్పుకున్నాడు. కాగా-ఈ కేసులో నిందితుడైన తారిఖ్ అహ్మద్ షా, అతని కూతురు ఇన్ షా జాన్ కి కూడా అబ్బాస్ ఆశ్రయం కల్పించాడు. ఈ తండ్రీ కూతుళ్లను ఈ నెల 3 న అరెస్టు చేశారు.
పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14 కు ముందు జరిగిన కుట్రను దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసును చేపట్టింది.