Priyanka Gandhi: గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన ట్రాక్టర్ల ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన నవరీత్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పరామర్శించారు. గురువారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ వెళ్లి నవ్‌రీత్ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. మృతుడి కుటుంబ సభ్యులు న్యాయ విచారణ కోరుకుంటున్నారని తెలిపారు. రైతులు, వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం నిజమైన పోరాటంగా గుర్తించడం లేదని.. దీని వెనుక ఎలాంటి రాజకీయాలు లేవంటూ ఆమె స్పష్టంచేశారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులపై ప్రభుత్వం నేరాలు మోపుతూ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. చనిపోయిన వారిని ఉగ్రవాదుల్లాగా చిత్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదిలాఉంటే.. ప్రియాంక గాంధీ ఉదయం రాంపూర్ వెళుతున్న క్రమంలో ఆమె కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రియాంక గాంధీతోపాటు ఆమె భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం అనంతరం ప్రియాంక గాంధీ స్వయంగా కారు అద్దాలను తుడుస్తూ కనిపించారు.
Also Read: