పరీక్షల సమయంలో విద్యార్థుల్లో సహజంగా ఉండే భయాలను, ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు ప్రధాని. ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో ఈ రోజు 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
పరీక్షలంటే విద్యార్థులకుండే భయం, ఒత్తిడిని ఎలా అధిగమించాలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్షణం. ఇందులో భాగంగా పాఠశాలల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. పరీక్షల పట్ల విద్యార్థులకు ఉండే భయం, ఒత్తిడిని ఎలా అధిగమించాలో అవగాహన కల్పిస్తారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమానికి 155 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక మనదేశానికి చెందిన 81వేల మందికి పైగా విద్యార్థులు, 11వేల మందికి పైగా ఉపాధ్యాయులు, 5వేల మందికి పైగా తల్లిదండ్రులు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
9 నుంచి 12 తరగతుల విద్యార్థులు, ఎంపికైన ఉపాధ్యాయులతో పాటు పాల్గొనడానికి నమోదు చేసుకున్న తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోనూ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. సనత్ నగర్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లలో ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ హాజరు కానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..