
Prime Minister Modi: అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని విపక్షాలను ఆయన కోరారు. ఇదే సమయంలో రైతుల ఆందోళలనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రైతలకు కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుందని అన్నారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధమే అని స్పష్టం చేశారు. రైతుల సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో చర్చలు జరిపారని, ఇంకా చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. అయితే, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తాము సిద్ధమని చెప్పిన ప్రధాని మోదీ.. రైతుల ప్రధాన డిమాండ్ అయిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై మాత్రం స్పందించలేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 65 రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు జనవరి 26న తారాస్థాయికి చేరాయి. రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. దాంతో రైతు ఉద్యమంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇప్పటికే రైతులను ఢిల్లీ సరిహద్దులు ఖాళీ చేయాలంటూ పోలీసులు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే.. రైతులు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆందోళనలు విరమించేది లేదని భీష్మించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు.
Also read:
ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏఈఈ నాగేశ్వరరావు అరెస్టు.. సెంట్రల్ జైలుకు తరలింపు