నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఆయన మాతృమూర్తి హీరాబెన్ తుదిశ్వాస విడిచినా.. ఆ బాధలోనూ ఆయన విధులను మరవలేదు. బాధను దిగమింగుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంగా నది, దాని ఉపనదుల కాలుష్య నివారణ, పునరుజ్జీవనం, పర్యవేక్షణకు సంబంధించిన విషయాలను కౌన్సిల్ లో చర్చించారు. ఈ సమావేశానికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో పాటు కౌన్సిల్ సభ్యులుగా ఉన్న జలశక్తి మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
కాగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను బెంగాల్‌కు రావాల్సిందని, కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాయని వివరించారు. నమామి గంగే కార్యక్రమం అనేది సమీకృత పరిరక్షణ మిషన్. జూన్ 2014 లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్’గా ఆమోదించారు. దీని బడ్జెట్ రూ. 20,000 కోట్లతో జాతీయ నది గంగా నదిని పరిరక్షించడం ప్రధాన లక్ష్యం.
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసిజి) ఎగ్జిక్యూటివ్ కమిటీ 46వ సమావేశంలో గంగా బేసిన్‌లో మురుగునీటి పారుదల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.2,700 విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులలో 12 ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లకు చెందినవి. ఇటీవల.. నమామి గంగేను ఐక్యరాజ్యసమితి టాప్ 10 వరల్డ్ రిస్టోరేషన్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటిగా గుర్తించడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..