
President Kovinid conducted video conference with all Governors: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా నియంత్రణకు కేంద్ర తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రాలలో వున్న తాజా పరిస్థితిపై రాష్ట్రపతి వాకబు చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రౌండ్ లెవెల్‌లో వున్న పరిస్థితిని రాష్ట్రపతి తెలుసుకున్నారు. కరోనాపై కొనసాగుతున్న యుద్ధంలో వైద్య సిబ్బంది సేవలను, పోలీసుల పాత్రను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడినట్లు సమాచారం. అదే సమయంలో లాక్ డౌన్ వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలు, వాటిని అడ్రస్ చేయడంలో ప్రభుత్వాల చొరవ గురించి గవర్నర్లను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రపతి.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్… దేశంలోని పేద, దిగువ మధ్యతరగి ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావం చేస్తున్న విషయాన్ని గవర్నర్లు.. రాష్ట్రపతి దృష్టికి తేగా… తాజాగా కేంద్రం రాష్ట్రాలకిచ్చిన ఆదేశాలతో పరిస్థితి మెరుగవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్ ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం వుందని రాష్ట్రపతి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.