Punjab Power Cuts: ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్తు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. బొగ్గు కొరత కారణంగా పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. బొగ్గు కొరతతో మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సి పరిస్థితి వచ్చింది. తమ రాష్ట్రానికి బొగ్గు సరఫరా పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో 5,620 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నా ప్రస్తుతం 2,800 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు కొరత ఫలితంగా పంజాబ్‌లోని లెహ్రా మొహబ్బత్, రోపర్ (రూప్‌నగర్), రాజ్‌పురా, తల్వాండి సాబో, గోయింద్వాల్ సాహిబ్‌తో సహా థర్మల్ పవర్ ప్లాంట్లు మరో నాలుగు రోజులు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయగలవని, పంజాబ్‌లో ఇప్పటికే ఐదు థర్మల్ పవర్ ప్లాంట్‌లు మూసివేశారు. బొగ్గు కొరత కారణంగా రోపర్‌లో రెండు, తల్వంతి సాబోలో రెండు, లెహ్రా మొహబ్బత్‌లో ఒకటి మూసివేశారు.
అయితే శనివారం గరిష్టంగా 8,788 మెగావాట్ల విద్యుత్ సమస్యను తీర్చగా, పవర్ ఎక్ఛ్సేంచ్ నుంచి యూనిట్‌కు రూ.11.60 చొప్పున ఆదివారం అవసరాల కోసం దాదాపు 1800 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. ఉత్పత్తి తగ్గటంతో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) ప్రైవేట్ సంస్థలు, పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. బొగ్గు కొరత కారణంగా పీఎస్‌పీసీఎల్ బుధవారం వరకు రెండు నుంచి మూడు గంటల వరకు విద్యుత్ కోతలను విధించనున్నట్లు చెప్పారు. అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ సమయం కోత ఉండే అవకాశం ఉందని చెప్పారు.
థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో వాటిని 50 శాతం సామర్థ్యంతోనే నడుపుతున్నారు. అయితే విద్యుత్ పూర్తి స్థాయిలో పునరుద్దరించాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సి ఉందని అన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అయితే బొగ్గు నిల్వలు తగ్గిపోవడం, తగినంత బొగ్గు రాక ఈ సమస్య వచ్చిందని, అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ సమస్య తీరుతుందని ఆయన అన్నారు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని వేణు ప్రసాద్ అన్నారు.
పంజాబ్‌లో తీవ్రస్థాయి విద్యుత్ కోత పరిస్థితి ఏర్పడటంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు పంజాబ్ విద్యుత్ సంస్థ పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలుకు దిగింది. ఇచ్చిపుచ్చుకునే ప్రాతిపదికన ఈ మేరకు విద్యుత్ బేరాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ప్రైవేటు కరెంటు తీసుకున్న పరిస్థితితో ప్రభుత్వానికి అదనపు భారం పడుతోందని పంజాబ్ విద్యుత్ సంస్థ ఛైర్మన్ ఎ వేణు ప్రసాద్ తెలిపారు. ఇక ఉత్పత్తి సరిగ్గా లేకపోవడంతో రోజుకు మూడు గంటల వరకు కోత ఏర్పడుతోందన్నారు. ఈ విద్యుత్ విద్యుత్ సంక్షోభం కారణంగా విద్యుత్ కొనుగోలులో ప్రభుత్వానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆయన అన్నారు.