Watch: లాకప్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌.. కారణం తెలిస్తే అవాక్కే..

లాకప్‌లో సాధారణంగా దొంగలను, నేరస్థులను చూస్తూ ఉంటాం.. మరి పోలీసులను ఎప్పుడైనా లాకప్‌లో చూశారా?.. అయితే ఓ చోట అదే జరిగింది. ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను లాకప్‌లో ఉంచిన విచిత్ర ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. అసలు పోలీసును లాకప్‌లో ఉంచడమేంటి.. అది కూడా యూనిఫామ్‌లో ఉండగానే లాకప్‌లో ఉంచేంత తప్పు అతనేం చేశాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Watch: లాకప్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌.. కారణం తెలిస్తే అవాక్కే..
Police Inspector Sent To Lockup By Judge

Edited By: Krishna S

Updated on: Sep 13, 2025 | 11:57 AM

సాధారణంగా లాకప్‌లో నేరస్థులు ఉంటారు. కానీ ఒక పోలీస్ అధికారి, అది కూడా యూనిఫామ్‌లో ఉన్నప్పుడు, లాకప్‌లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హర్యానాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని కైథల్ జిల్లా కోర్టులో ఓ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ కోర్టుకు హాజరు కావాలి. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఆయన అరగంట ఆలస్యంగా అంటే 10:30 గంటలకు కోర్టుకు వచ్చారు. ఆలస్యంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్‌పై అదనపు సెషన్స్ జడ్జి మోహిత్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు సమయాన్ని లెక్కచేయలేదని మండిపడ్డారు. అంతేకాకుండా ఇన్‌స్పెక్టర్ రాజేష్‌ను 10:30 నుండి 11:30 గంటల వరకు కోర్టు లాకప్‌లో ఉంచాలని ఆదేశించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అని, తరచూ ఇలాంటి నిర్లక్ష్యం తగదని జడ్జి స్పష్టం చేశారు. అంతేకాదు ఆయన జీతాన్ని కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

కోర్టు ఆగ్రహానికి కారణం ఇదే!

ఇన్‌స్పెక్టర్ రాజేష్ నిర్లక్ష్యం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు గతంలో ఆదేశించినప్పటికీ, ఇన్‌స్పెక్టర్ సహకరించకపోవడంతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు, ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని న్యాయస్థానం తన తీర్పులో తెలిపింది. కోర్టు నిబంధనలను అతిక్రమించే ఎవరికైనా ఇలాంటి కఠిన చర్యలు తప్పవని జడ్జి గట్టిగా హెచ్చరించారు. లాకప్‌లో గంటపాటు గడిపిన తర్వాత ఇన్‌స్పెక్టర్ రాజేష్ సాక్ష్యం చెప్పడానికి కోర్టులో హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత ఆయనను విడుదల చేశారు.