Modi Kashmir Tour: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌‌లో ప్రధాని మోదీ పర్యటన

రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడకు వెళుతుండటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఇప్పుడు అందరి ఫోకస్‌ రేపటి మోదీ జమ్ము కశ్మీర్‌ పర్యటనపై ఉంది.

Modi Kashmir Tour: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌‌లో ప్రధాని మోదీ పర్యటన
Pm Modi

Updated on: Apr 23, 2022 | 7:43 AM

Modi Jammu Kashmir Tour: రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అక్కడకు వెళుతుండటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఇప్పుడు అందరి ఫోకస్‌ రేపటి మోదీ జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir) పర్యటనపై ఉంది. రేపు జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం. రేపే ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నారు. 2019 ఆగస్టు 5న మోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది. దాంతో ప్రత్యేక హోదాను కోల్పోయింది జమ్ము కశ్మీర్‌. అంతేకాకుండా ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అత్యంత కీలకమైన ఈ రెండు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మోదీ జమ్ము కశ్మీర్‌కు వెళుతుండటం ఇదే మొదటిసారి.

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ వేళ సాంబా జిల్లాలోని పల్లీ గ్రామం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దేశంలోని మొదటి కార్బన్‌-న్యూట్రల్‌ గ్రామంగా పల్లీ గుర్తింపు పొందింది. ఇక్కడ నుంచే 32 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ఇది జమ్ము కశ్మీర్‌ అభివృద్ధిపరంగా ఎలా మార్పు చెందుతోందో చెప్పే ప్రయత్నమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే 2018 జూన్‌ నుంచి జమ్ము కశ్మీర్‌లో కేంద్ర పాలన కొనసాగుతోంది. అయితే తగిన సమయంలో జమ్ము కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని 2019లో ఇండిపెండెన్స్‌ డే స్పీచ్‌లో హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.

గత ఏడాది జూన్‌ 24 జమ్ము కశ్మీర్‌కు చెందిన నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు మోదీ. అప్పుడు మొదలైన రాజకీయ ప్రక్రియ విషయంపై మోదీ ఏం మాట్లాడతారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు జమ్ము కశ్మీర్‌ డీలిమిటేషన్‌ కమిషన్‌ తన డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇక ఎన్నికల నగారా మోగేది ఎప్పుడో తేలాల్సి ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ డిమాండ్‌పై టైమ్‌లైన్‌ సెట్‌ చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే మోదీ పర్యటనకు 48 గంటల ముందు భారీ ఉగ్ర దాడులు జరిగాయి. సీఐఎస్‌ఎఫ్‌ ఫోర్స్‌ను తరలిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా కమాండర్‌ యూసఫ్‌ కంత్రూ కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో జమ్ము కశ్మీర్‌లో భద్రతను పెంచారు.

Read  Also… Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోనూ బుల్‌డోజర్ కలకలం.. ఏకంగా అధికారిపైనే..