SBMU – AMRUT 2.0: కేంద్రంలోని మోదీ సర్కార్ నేడు మరో రెండు ప్రధాన పథకాలకు శ్రీకారం చుట్టనుంది. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 (SBM-U), అమృత్ 2.0 (AMRUT) పథకాలను ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోమై ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతోపాటు హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల సహాయ మంత్రి, అధికారులు హాజరుకానున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (SBM-U) 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (AMRUT) 2.0 పథకాలు నగరాలన్నింటినీ చెత్త రహితంగా.. నీటి భద్రతగా మార్చాలనే ఆకాంక్షను నెరవేర్చేందుకు రూపొందించినట్లు పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ఈ పథకాలు భారతదేశాన్ని వేగంగా పట్టణీకరించే సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించే దిశగా రూపొందించారు. 2030 నాటికి దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ పథకాలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయని ప్రధాని కార్యాలయం తెలిపింది.
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 (ఎస్‌బీఎం యూ) ద్వారా పురపాలక సంఘాల పరిధిలోని అన్ని రకాల ఘన వ్యర్థాల ప్రాసెసింగ్, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ కోసం లెగసీ డంప్‌సైట్‌ల నివారణ కోసం దాదాపు రూ. 1.41 లక్షల కోట్ల నిధులను సమకూర్చనున్నారు. లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన అన్ని పట్టణ, స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహితంగా (ODF) మార్చాలని లక్ష్యంగా రూపొందించారు.
అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ 2.0 మిషన్ (అమృత్ 2.0) ద్వారా.. దాదాపు 4,700 పట్టణాలు, అర్బన్ ప్రాంతాల్లో 100 శాతం నీటి సరఫరాకు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్‌లు, 100 శాతం మురుగునీటి డ్రైనేజీల నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. అమృత్ 2.0 పథకానికి దాదాపు 2.87 లక్షల కోట్ల నిధులను సమకూర్చనున్నారు.
Also Read: