PM Narendra Modi requested farmers: రైతులు ఇకనైనా ఉద్యమాన్ని వీడి ప్రభుత్వంతో చర్చకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. అందరూ రైతుల నిరసన గురించి మాట్లాడుతున్నారని.. కానీ దాని వెనుక గల కారణాలను మాట్లాడటం లేదని విపక్షాలపై మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలా కాలంగా ఆందోళనల్లో కూర్చున్న రైతులంతా ఇళ్లకు చేరుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుందని.. అందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. సాగు చట్టాలను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే, రైతులు అంధకారంలో మునిగిపోయే అవకాశం ఉందన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తూ విపక్ష పార్టీల తీరుపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా మోదీ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. పెద్ద పెద్ద మార్కెట్ వ్యవస్థలను తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయి. వాటిని తొలగించి, రైతులకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నామంటూ మన్మోహన్ సింగ్ ఒకప్పుడు పేర్కొన్నారని మోదీ గుర్తుచేశారు. ఆ పనిని తాము చేశామని.. దానికి అందరూ గర్వపడాలని.. కానీ ఇప్పుడు రాజకీయాల కోసం యూటర్న్ తీసుకున్నారని మోదీ విపక్షాలపై విమర్శలు చేశారు. రైతులకు ఏది మేలు చేకూరుస్తుందో వాటినే తీసుకొస్తున్నామని ఇకపై కూడా తీసుకొస్తామని మోదీ రాజ్యసభలో స్పష్టం చేశారు.
గతంలో లాల్‌బహదూర్ శాస్త్రి కూడా సంస్కరణలకు అనుగుణంగా అడుగులు వేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయలేదని మోదీ గుర్తు చేశారు. ఆ సమయంలో వామపక్షాలు కాంగ్రెస్‌పై అమెరికా ఏజెంట్లంటూ విరుచుకుపడేవారని, ఇప్పుడు కూడా వారే తనను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా చట్టం ప్రవేశపెట్టిన కొన్ని రోజుల తర్వాత మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయని.. కొత్త వ్యవసాయ చట్టాల్లోని మంచిని వివరించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వివరించారు.
భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని పేర్కొన్నారు. భారతీయ చరిత్ర మొత్తం.. అనేక ప్రజాస్వామ్య సంస్థల్లో నిండిఉందని.. ప్రాచీన భారతంలో కనీసం 81 ప్రజాస్వామ్యాల గురించి చెప్పినట్లు ఉందన్నారు. భారత జాతీయవాదంపై జరుగుతున్న దాడుల గురించి పౌరులకు హెచ్చరించడం అవసరమన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాజీ ప్రధాని దేవగౌడను ప్రశంసించారు. రైతు సమస్యలపై దేవగౌడ చాలా సునిశితంగా మాట్లడారని చెప్పారు. అంతేకాకుండా టీఎంసీ ఎంపీ డేరిక్ ఓబ్రియన్, కాంగ్రెస్ బజ్వా చేసిన ప్రసంగంపై మోదీ సెటైర్లు వేశారు. డేరిక్ ఓబ్రియన్ వాక్ స్వాతంత్ర్యం, బెదిరింపుల గురించి మాట్లాడారని. అప్పుడు ఆయన బెంగాల్ గురించి మాట్లాడుతున్నారా..? లేక దేశం గురించి మాట్లాడుతున్నారా.. అని ఆశ్చర్యపోయానంటూ ఎద్దెవా చేశారు. అంతేకాంకుడా బజ్వా మాటలను గుర్తు చేస్తూ.. ఎమర్జెన్సీ దగ్గరకు చేరలేం..కాంగ్రెస్ ఈ దేశాన్ని మరింత నిరూత్సాహానికి గురిచేస్తుందంటూ విమర్శించారు.
Also Read: