
భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం వారణాసి చేరుకున్న ప్రధాని.. నాడేసర్‌లో జరిగిన వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు చిన్నారులతో మాట్లాడారు. ఇందులో భాగంగానే ఓ చిన్నారితో మాట్లాడిన వీడియోను మోదీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..
వారణాసిలోని విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఎగ్జిబిషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విద్యార్థినితో మాట్లాడారు. ఆకుపచ్చని మొక్కలు, కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను ప్రదర్శిస్తున్న తన ప్రదర్శనను చిన్నారి ప్రధానికి వివరించింది. ప్రక్రియను వివరించడానికి ఆమె ఒక పద్యం కూడా చెప్పింది. చిన్నారి పద్యం పాడిన వీడియోను ప్రధాని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోతోపాటు.. ‘వారణాసిలో ఉన్న నా ఫ్రెండ్‌కి సైన్స్ బాగా తెలుసు, అలాగే తను గొప్ప కవి కూడా’ అంటూ రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. వారణాసి పర్యటనలో భాగంగా మొదీ తొలి రోజు.. విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం వంటి రాష్ట్రాల్లో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ చూసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభ మోదీ మాట్లాడుతూ.. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు మనసుపెట్టి సంకల్పించాలని విజ్ఞప్తి చేశారు. 140 కోట్ల మంది దేశప్రజలు దేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకుంటే, భారతదేశం కచ్చితంగా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు.
విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర తనకు ఒక పరీక్ష అన్న మోదీ.. దీని ద్వారా తాను వాగ్దానం చేసినవి నెరవేరాయా లేదో, ప్రజలకు ఇళ్లు వచ్చాయా, ఇల్లు లేనివారికి ఇళ్లు వచ్చాయా అని తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం మోదీ.. రూ. 19,000 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులను ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..