చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ యువతకు కీలక సూచనలు చేశారు.“క్యాంపస్‌లో సిలబస్ ఉంటుంది.. కానీ జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు ఉంటాయి” అంటూ యువతను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితానికి నిర్దిష్టమైన ప్రశ్నపత్రం, ముందుగా నిర్ణయించిన మార్గం ఉండదని.. కొన్నిసార్లు అసలు ప్రశ్న ఏమిటో కూడా ఎవరూ చెప్పరని, దాన్ని తామే గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.

చదువుల్లోనే కాదు.. జీవితమే అసలు పరీక్ష.. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
Pm Narendra Modi In Iit Delhi

Updated on: Aug 08, 2026 | 1:00 PM

విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ యువతకు కీలక సూచనలు చేశారు.“క్యాంపస్‌లో సిలబస్ ఉంటుంది.. కానీ జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు ఉంటాయి” అంటూ యువతను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితానికి నిర్దిష్టమైన ప్రశ్నపత్రం, ముందుగా నిర్ణయించిన మార్గం ఉండదని.. కొన్నిసార్లు అసలు ప్రశ్న ఏమిటో కూడా ఎవరూ చెప్పరని, దాన్ని తామే గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.

శనివారం (ఆగస్టు 08) జరిగిన ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో 3,000 మందికి పైగా పట్టభద్రులు, వారిలో 587 మంది పీహెచ్‌డీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గతంలో కోవిడ్ సమయంలో వర్చువల్‌గా విద్యార్థులతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఈసారి వారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

డిగ్రీతో పాటు జ్ఞాపకాలను తీసుకెళ్తున్నారు

విద్యార్థులు ఐఐటీ నుంచి కేవలం డిగ్రీ మాత్రమే తీసుకెళ్లడం లేదని ప్రధాని మోదీ అన్నారు. కలలు, స్నేహాలు, జ్ఞాపకాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, క్యాంపస్ అనుభవాలను కూడా జీవితాంతం తమతో తీసుకెళ్తున్నారని చెప్పారు. కళాశాలలో తొలి రోజు నుంచి స్నాతకోత్సవం వరకు విద్యార్థులు సాగించిన ప్రయాణాన్ని ప్రధాని గుర్తుచేశారు. మిడ్‌-సెమిస్టర్ పరీక్షలు, అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, ప్రయోగశాలల్లో ఎదురైన సమస్యలు వంటి చిన్న చిన్న దశలే చివరకు విద్యార్థులను ఈ స్థాయికి తీసుకొచ్చాయని అన్నారు. కష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని ఐఐటీ విద్యార్థులు సంపాదించుకున్నారని ప్రశంసించారు. “సవాళ్లకు భయపడకండి.. ఇబ్బందుల్లోనే అవకాశాలు దాగి ఉంటాయి” అని మోదీ సూచించారు. ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాని నుంచి నేర్చుకుని మరింత మెరుగైన ఫలితాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అన్నారు.

ప్రశ్నించండి.. పరిష్కారాలు కనుగొనండిః మోదీ

యువతలో జిజ్ఞాసను ఎప్పటికీ సజీవంగా ఉంచుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ఆలోచించకుండా అంగీకరిస్తున్న విషయాలను పరిశీలించాలని, ప్రశ్నించాలని అన్నారు. అయితే కేవలం ప్రశ్నలు అడగడంతో ఆగిపోకుండా పరిష్కారాలను కనుగొనే ధైర్యం కూడా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచం అత్యంత వేగంగా మారుతోందని మోదీ అన్నారు. ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలు, శక్తి సమతుల్యతలు మారుతున్నాయని.. ఈ మార్పు వెనుక సాంకేతికత వేగం ప్రధాన కారణమని చెప్పారు. రాబోయే 20–30 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పుడే కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదన్నారు.

‘ఆత్మనిర్భర్ భారత్’పై ఫోకస్

భారత్ ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఇదే బలమైన పునాది అవుతుందని అన్నారు. సెమీకండక్టర్ రంగాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన మోదీ.. ఒకప్పుడు భారత్‌లో చిప్ తయారీ సాధ్యమా? అని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ఇప్పుడు దేశంలో తొలి సెమీకండక్టర్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. చిప్‌ల నుంచి ఓడల వరకు అన్నీ భారత్‌లోనే తయారయ్యే స్థాయికి దేశం చేరుకోవాలని ఆకాంక్షించారు. స్టార్టప్ విప్లవాన్ని బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ సోనిపట్ క్యాంపస్‌లో ఏఐ ఆధారిత అత్యున్నత పనితీరు గల సూపర్ కంప్యూటింగ్ కేంద్రం ‘పరం ప్రజ్ఞ’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికత, పరిశోధన, కృత్రిమ మేధ రంగాల్లో ఇది విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగపడనుంది.

ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండిః ప్రధాని

విద్య, కెరీర్‌తో పాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. విజయాన్ని సాధించే క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అలాగే గోబర్ధన్ యోజనను ప్రస్తావిస్తూ.. ఆవు పేడ, వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే దిశగా భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు రైతులకు కొత్త అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.

మొత్తంగా.. డిగ్రీతో విద్యార్థుల ప్రయాణం ముగియదని, అసలు పరీక్షలు జీవితంలోనే ప్రారంభమవుతాయని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం, జిజ్ఞాస, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే భవిష్యత్ భారత నిర్మాణంలో యువత కీలక శక్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us