భారతీయ రైల్వే ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. వేగంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకువెళుతోంది. ఇందులో భాగంగానే దేశంలో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేస్‌లో సరికొత్త అధ్యయనానికి తెర తీసిన ఈ రైళ్లకు ప్రజల నుంచి కూడా భారీగా ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా భారత్‌లో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. డిసెంబర్ 30వ తేదీన తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ డిసెంబర్ 30 ప్రధాని అయోధ్యలో విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలోనే అదే రోజు తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారని సమాచారం. దేశలో తొలుత రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమవుతాయని, అందులో ఒకటి అయోధ్య నుంచి ఉంటుందని ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. వీటిలో ఒకటి అయోధ్య నుంచి దర్భంగ మధ్య నడస్తుందని, రెండో ట్రైన్ దక్షిణ భారతదేశంలో నడుస్తుందని చెప్పుకొచ్చారు.
ఇక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకతల విషయానికొస్తే ఇందులో మొత్తం 22 బోగీలు ఉంటాయి. వీటిలో 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. గార్డు కంపార్ట్‌మెంట్లలో విడిగా కోచ్‌లు ఉంటాయి. మహిళలు, దివ్యాంగులైన ప్రయాణికులకు సీటింగ్ ఉంటుంది. ఇక వేగం విషయానికొస్తే ఈ రైలు సగటున గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఈ రైలుకు ముందు, వెనక ఇంజన్లు ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ఈ రైలు సేవలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..