మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు మంత్రులు సరిగా హాజరుకావడం లేదంటూ మోదీ ఫైర్ అయ్యారు. మంత్రులకు ఇంకా ఆయా శాఖలపై పట్టు రాలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌కు రాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని మోదీ ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఆ మంత్రుల పేర్లు తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాల శాఖల మంత్రిని ఆదేశించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు.
పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం.. మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడంపై మోదీ మండిపడ్డారు. రాజకీయాలకు ఆతీతంగా ఎంపీలు పని చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు. దేశంలో అనేక చోట్ల ఏర్పడిన నీటి ఎద్దడి గురించి ప్రస్తావించిన ఆయన.. జల్ అభియాన్ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఈ నేపథ్యంలో ఈ ఎద్దడిని తీర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీబీ, కుష్టు వంటి వ్యాధులు ప్రభలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కూడా ఎంపీలకు హితవు పలికారు.