
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు కొనసాగుతున్నాయి. జూలై 23 నుండి 26 వరకు యూకే, మాల్దీవుల్లో మోదీ పర్యటించనున్నారు. యూకేతో ద్వైపాక్షిక చర్చలు, మాల్దీవుల 60వ సంవత్సర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రధాని పాల్గొంటారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు మోదీ జూలై 23 – 24 తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారు. బ్రిటన్‌లో ప్రధాని పర్యటించడం ఇది నాలుగవ సారి. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చలు జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చలు జరపనున్నారు. యూకే పర్యటన సందర్భంగా కింగ్ చార్లెస్ III ను కూడా ప్రధాని కలుస్తారు. భారత్ – యూకే రెండు దేశాలు వాణిజ్యం ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, నూతన ఆవిష్కరణ, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య ,ప్రజా సంబంధాలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (CSP) పురోగతిని సమీక్షించనున్నాయి
జూలై 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి తమ ‘గౌరవ అతిథి’గా ద్వీప దేశాన్ని సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. జూలై 25 – 26 తేదీల్లో ప్రధాని మాల్దీవులను సందర్శిస్తారు. ద్వీప దేశంలో మోదీ పర్యటించడం మూడో సారి. సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రతా భాగస్వామ్యం కోసం భారతదేశం-మాల్దీవులు ఉమ్మడి ప్రణాళిక అమలు పురోగతిపై చర్చిస్తారు. ఈ మిషన్‌ను అక్టోబర్ 2024లో అధ్యక్షుడు ముయిజు భారత పర్యటన సందర్భంగా చేపట్టారు. ఇది భారత్ – మాల్దీవుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం యొక్క ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంలో మాల్దీవులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి, బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.
ప్రధాని మోదీ రెండు దేశాల పర్యటన ఖరారైన నేపథ్యంలో ప్రధాని విదేశి పర్యటనను కాంగ్రెస్ విమర్శలు గప్పించింది. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు భయపడి మోదీ విదేశాకు వెళ్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలు, దేశ భద్రత, విదేశాంగ విధానం గురించి పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో మోదీ విదేశీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..