Gujarat Flight Crash: గుజరాత్‌ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. హోంమంత్రికి కీలక ఆదేశాలు జారీ!

గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికుల 12 మంది సిబ్బందితో అహ్మాదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయల్దేరిన విమానం టేకాప్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ప్రధాని మోదీ వెంటనే పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడారు. తక్షణమే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి అమిత్‌షా, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Gujarat Flight Crash: గుజరాత్‌ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. హోంమంత్రికి కీలక ఆదేశాలు జారీ!
Modi

Updated on: Jun 12, 2025 | 4:18 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్‌ పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వెంటనే పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. “రక్షణ, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు అహ్మదాబాద్ వెళ్తున్నారని ప్రధానమంత్రికి సమాచారం అందింది. అవసరమైన అన్ని సహాయాలను వెంటనే అందించాలని, పరిస్థితి గురించి క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధానమంత్రి మంత్రిని ఆదేశించారు” అని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. విమాన ప్రమాదం తర్వాత బాధితులకు సాధ్యమైనంత సహాయం అందేలా చూడాలన్నారు. అహ్మదాబాద్ వెళ్లి సహాయం అందించాలని ఆయనను ఆదేశించారు.

మరోవైపు విమాన ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి షాక్‌కు గురయ్యానని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తక్షణమే ఆయన గుజరాత్ బయల్దేరి వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. అక్కడే ఉండి సహాయక చర్యలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

మరోవైపు ప్రధాని మోదీ ఆదేశాలతో కేంద్రహోంమంత్రి అమిత్‌ షా సైతం అహ్మదాబాద్‌ బయల్దేరారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఇప్పటికే ఆయన స్థానిక అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా తానే వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని గుజరాత్‌ ప్రభుత్వానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలంలో వీలైనన్ని అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూరత్ నుండి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయ చర్యలను ప్రారంభించాలని సంబంధింత అధికారులకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూచనలు ఇచ్చారు. గాయపడిన ప్రయాణీకులకు తక్షణ చికిత్స అందించాలని కూడా ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..