PM Modi: యుద్ధం ఎఫెక్ట్.. ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్.. ఇంధన సంక్షోభంపై కీలక చర్చలు..

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి నిత్యావసర వనరుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

PM Modi: యుద్ధం ఎఫెక్ట్.. ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్.. ఇంధన సంక్షోభంపై కీలక చర్చలు..
Pm Modi Chairs High Level Meet On Middle East Crisis

Updated on: Mar 22, 2026 | 5:27 PM

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం, విద్యుత్, ఎరువుల లభ్యతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా వనరుల పంపిణీ వ్యవస్థలో ఎక్కడా అంతరాయం కలగకూడదని అధికారులను ప్రధాని ఆదేశించారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల కొరత రాకుండా చూడటం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. వనరుల రవాణాకు సంబంధించి సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్వహించాలని ప్రధాని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తూ, వినియోగదారులకు, పరిశ్రమలకు భారం కలగకుండా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జాతీయ స్వభావానికి పరీక్షా సమయం

ఈ సంక్షోభ పరిస్థితులపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇది మన దేశ సామర్థ్యానికి, సహనానికి ఒక కీలక పరీక్ష అని అభివర్ణించారు. పశ్చిమ ఆసియా సంఘర్షణ వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రజా చైతన్యం, ప్రభుత్వ కృషీ తోడవాలని ఆయన ఆకాంక్షించారు. సరఫరా గొలుసులో తలెత్తే అడ్డంకులను అధిగమించేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు.

హోర్ముజ్ జలసంధిపై ఆందోళన

ప్రపంచ ఇంధన రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం ప్రధాన ఆందోళనకర అంశంగా మారింది. ఇరాన్ ఈ మార్గంపై పట్టు సాధించి నౌకల రాకపోకలను పరిమితం చేయడం వల్ల భారతదేశానికి చేరే చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతీకార దాడుల వల్ల ఈ కీలక జలమార్గం యుద్ధ భూమిగా మారింది.

గ్లోబల్ లీడర్లతో సంప్రదింపులు

పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ దౌత్యపరమైన వ్యూహాలను కూడా అమలు చేస్తున్నారు. సంఘర్షణ మొదలైనప్పటి నుండి ఆయన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలతో పాటు ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల అధినేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాంతీయ శాంతిని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచ ఇంధన భద్రతను కాపాడాలని భారత్ కోరుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us