మీరు దేశానికి గర్వకారణం.. విక్రమ్-1 సక్సెస్‌‌పై స్కైరూట్ టీమ్‌కు ప్రధాని మోదీ అభినందనలు!

విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందించారు. భారత యువత ప్రతిభకు ఇది నిదర్శనమని కొనియాడిన ఆయన, మీరు దేశానికి గర్వకారణంగా నిలిచారు అంటూ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మీరు దేశానికి గర్వకారణం.. విక్రమ్-1 సక్సెస్‌‌పై స్కైరూట్ టీమ్‌కు ప్రధాని మోదీ అభినందనలు!
Pm Narendra Modi

Updated on: Jul 18, 2026 | 5:51 PM

భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రక మైలురాయిగా నిలిచిన స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో విజయోత్సాహంలో ఉన్న యువ శాస్త్రవేత్తలతో మాట్లాడిన ప్రధాని, ఈ ఘనత దేశానికి గర్వకారణమని కొనియాడారు. స్కైరూట్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందనతో మాట్లాడిన ప్రధాని మోదీ, మీరు భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. అంతరిక్షంలో భారత ఆకాంక్షలను నాటారు. అదే సమయంలో భారత యువత కలలకు బలమైన పునాది వేశారు అని ప్రశంసించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ఫోన్‌లో ఉన్న మొత్తం బృందం ప్రధాని సందేశాన్ని విని ఆనందంలో మునిగిపోయింది.

స్కైరూట్ బృందం సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని పవన్ కుమార్ చందన వివరించగా, భారత యువతపై తనకున్న విశ్వాసాన్ని ఈ జట్టు నిజం చేసిందని ప్రధాని అన్నారు. భారత యువత అద్భుతాలు సృష్టించగలదనే నమ్మకాన్ని మీరు మరొకసారి రుజువు చేశారు. దేశ అంతరిక్ష కలలను నిజం చేసే దిశగా మీ ప్రయాణం కొనసాగాలి అని మోదీ పేర్కొన్నారు.

వీడియో చూడండి

ఈ సందర్భంగా ఆగమన్ మిషన్ పేరును ప్రస్తావించిన ప్రధాని, ఇది స్కైరూట్ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో ఈ యువ బృందం మరెన్నో విజయాలను అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన సంభాషణలో టీమ్ చేసిన కృషిని ప్రశంసిస్తూ, భారత అంతరిక్ష చరిత్రలో వారు కొత్త అధ్యాయాన్ని లిఖించారని అన్నారు. ప్రయోగానికి ముందు ప్రధానమంత్రి పంపిన చేతివ్రాత వందేమాతరం లేఖను విక్రమ్-1 రాకెట్‌తో పాటు అంతరిక్షంలోకి పంపిన విషయాన్ని పవన్ కుమార్ చందన ప్రస్తావించారు. వందేమాతరం ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లిపోయింది అని భావోద్వేగంతో ఆయన చెప్పగా, అందుకు కారణాన్ని ప్రధాని వివరించారు.

అనంతరం ఎక్స్‌లో స్పందించిన ప్రధాని మోదీ, విక్రమ్-1 విజయాన్ని భారత అంతరిక్ష రంగానికి నిర్ణయాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం వల్ల అంతరిక్ష రంగంలో కొత్త అవకాశాలు, ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతోందని పేర్కొంటూ, ఈ విజయం దేశ యువతను మరింత పెద్ద కలలు కనడానికి, ధైర్యంగా కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రేరేపిస్తుందని అన్నారు.

Follow Us