
భారత్-ఫ్రాన్స్‌ల మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని, భారత్-ఫ్రాన్స్ దేశాలు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు. ప్రపంచ శాంతికి కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచాభివృద్దికి ఏఐ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఫ్రాన్స్ భారతదేశపు పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటి అని అన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షులు మాక్రాన్‌తో కలిసి, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అపూర్వమైన సహకారం అందుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆర్థిక రాజధాని ముంబైలోని లోక్‌భవన్‌లో మెక్రాన్‌తో చర్చలు జరిపారు మోదీ. రాఫెల్ డీల్‌తో సహా పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే రక్షణరంగం , ఏఐ టెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. మొత్తంగా 20 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం ఫిబ్రవరి 19న ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మెక్రాన్ హాజరవుతారు.
భారత్ ఫ్రాన్స్ కలిసి 5వ జనరేషన్ విమానం ఇంజన్లు తయారు చేయాలని నిర్ణయించాయి. భారత్, ఫ్రాన్స్ మధ్య H125 హెలికాప్టర్లపై ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, మెక్రాన్ కలిసి కర్నాటకలోని వేమగల్‌లో టాటా హెలికాప్టర్ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు.
H-125 హెలికాప్టర్ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం – ఫ్రాన్స్ సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు ఎగరగల ప్రపంచంలోనే మొట్టమొదటి హెలికాప్టర్‌ను తయారు చేయడం పట్ల గర్విస్తున్నాము. దానిని మొత్తం ప్రపంచానికి ఎగుమతి చేస్తాము. భారత్ – ఫ్రాన్స్ మధ్య ఎటువంటి సరిహద్దులు లేవు. కొద్ది రోజుల క్రితం, EU తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసాము. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ – ఫ్రాన్స్ మధ్య సంబంధాలకు మరింత ఊపును తెస్తుంది” అని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఆవిష్కరణలు ఒంటరిగా జరగవు, సహకారం ద్వారా జరుగుతాయి. ప్రతి రంగంలోనూ మార్పిడి జరుగుతుందని ప్రధాని అన్నారు.
ఉగ్రవాదం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలపై పొంచి ఉన్న యుద్ధ ముప్పు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “అది ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా, ఇండో-పసిఫిక్ అయినా, ప్రతి ప్రాంతంలో శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తూనే ఉంటాము. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో నిర్మూలించడం మా ఉమ్మడి నిబద్ధత. త్వరలో ఫ్రాన్స్‌లో స్వామి వివేకానంద సంస్కృతి కేంద్రాన్ని ప్రారంభిస్తాము. ఈ రోజు, సంయుక్తంగా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము” అని ప్రధాని మోదీ అన్నారు.
“ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఎఐ ఇన్ హెల్త్, ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్‌లను ప్రారంభిస్తాము. ఇవి భవిష్యత్తును నిర్మించడానికి వేదికలు” అని ప్రధాని మోదీ అన్నారు. “నేడు ప్రపంచం అనిశ్చితి కాలంలో పయనిస్తోంది. అటువంటి పరిస్థితిలో, భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి ఒక శక్తిగా పని చేస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు.
ఆత్మీయ స్వాగతం పలికినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ – ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసినందుకు కృషి చేస్తామని తెలిపారు. భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగింపుపై ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త మార్గాలను అన్వేషించామన్నారు. AI , సౌరశక్తి రంగాలలో ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేశారు. రక్షణ, అంతరిక్షం, AI రంగాలలో భాగస్వామ్యాలను విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్టార్టప్‌ల కోసం తాము కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నానని మాక్రాన్ పేర్కొన్నారు.
ఐదవ తరం విమాన ఇంజిన్లపై కలిసి పనిచేస్తామని మాక్రాన్ పేర్కొన్నారు. రాఫెల్, జలాంతర్గాములు, హెలికాప్టర్ల సరఫరాకు గానూ ఒప్పందాలపై సంతకం చేస్తామన్నారు. ఐదవ తరం యుద్ధ విమానాలపై భాగస్వామిగా ఉంటామన్నారు. సాంకేతిక బదిలీపై ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రెండు దేశాలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అంతరిక్ష రంగంలో సంబంధాలు బలపడ్డాయని మాక్రాన్ గుర్తించారు. జూలైలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఆహ్వానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..