
ప్రధానమంత్రి పౌర సహాయ – అత్యవసర పరిస్థితుల సహాయ నిధి (PM CARES Fund)కు సంబంధించిన 2024-25 ఆర్థిక సంవత్సరపు ఆడిట్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం మార్చి 31, 2025 నాటికి ఫండ్‌లోని మొత్తం నిల్వలు సుమారు రూ.8,452.95 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం సుమారు రూ.7,188.63 కోట్లుగా ఉండగా.. ఏడాది వ్యవధిలో నిధి పరిమాణం గణనీయంగా పెరిగింది.
2020లో కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏర్పాటు చేసిన PM CARES Fundను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి లేదా మానవసృష్టి విపత్తులు, ఇతర సంక్షోభ సమయాల్లో సహాయం అందించేందుకు ఉద్దేశించారు. ఇది ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు పొందే సంస్థ కాదని, వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే స్వచ్ఛంద విరాళాల ఆధారంగా పనిచేస్తుందని ఫండ్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంటోంది.
ఫండ్‌లో ఎక్కువ మొత్తం ఎక్కడ ఉంది?
ఆడిట్ వివరాల ప్రకారం PM CARES Fundలోని పెద్ద మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచారు. సుమారు రూ.6,641 కోట్లు వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ పెట్టుబడుల ద్వారా 2024-25లో ఫండ్‌కు వడ్డీ ఆదాయం కూడా వచ్చింది. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో ఇంత పెద్ద మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంచడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే అత్యవసర సమయంలో అవసరమైన నిధులను అందుబాటులో ఉంచేందుకు ఫండ్ ఆర్థిక నిర్వహణలో భాగంగానే ఈ పెట్టుబడులు ఉండవచ్చని చూడాల్సి ఉంటుంది.
విరాళాల్లో తగ్గుదల
2024-25లో దేశీయ విరాళాల రూపంలో PM CARES Fundకు సుమారు రూ.4,790 కోట్లు అందినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దేశీయ విరాళాలు తగ్గాయి. విదేశీ విరాళాలు కూడా తగ్గినట్లు వివరాలు సూచిస్తున్నాయి. 2024-25లో విదేశాల నుంచి వచ్చిన విరాళాలు సుమారు రూ.92 లక్షలుగా ఉండగా, 2023-24లో ఈ మొత్తం దాదాపు రూ.1.13 కోట్లుగా ఉంది. అయితే విరాళాలు తగ్గినప్పటికీ, వడ్డీ ఆదాయం, ఇతర లెక్కల కారణంగా ఫండ్ మొత్తం నిల్వలు పెరిగాయి.
ఖర్చు ఎంత?
ఈ ఆడిట్ నివేదికలో అత్యంత ఆసక్తికరంగా కనిపించే అంశాల్లో వ్యయం కూడా ఒకటి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో PM CARES Fund నుంచి రూ.87.85 లక్షల మేర చెల్లింపులు నమోదయ్యాయి. ముఖ్యంగా PM CARES for Children పథకానికి సుమారు రూ.87 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో అమలు సంస్థల నుంచి PM CARES Fundకు సుమారు రూ.324.65 కోట్ల మేర రీఫండ్ వచ్చినట్లు ఆర్థిక వివరాల్లో నమోదైంది. అంటే గతంలో కేటాయించిన లేదా విడుదల చేసిన నిధుల్లో కొంత భాగం వినియోగించకుండా తిరిగి ఫండ్‌కు చేరినట్లు అర్థమవుతోంది.
ఆడిట్ ఎవరు చేశారు?
PM CARES Fund అధికారిక FAQ ప్రకారం ఈ నిధికి స్వతంత్ర ఆడిటర్‌ను నియమించే విధానం ఉంది. ఫండ్ ట్రస్టీలు ఆడిటింగ్ సంస్థను నియమిస్తారు. అధికారిక సమాచారం ప్రకారం PM CARES Fundను స్వతంత్ర ఆడిటర్ ఆడిట్ చేస్తారు. తాజా ఆర్థిక వివరాలకు సంబంధించిన నివేదికలో KKC & Associates LLP ఆడిటర్‌గా వ్యవహరించినట్లు పేర్కొ్న్నారు.
PM CARES Fundలో ఎవరున్నారు?
PM CARES Fund 2020 మార్చి 27న పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌గా నమోదు అయింది. భారత ప్రధానమంత్రి ఈ ట్రస్ట్‌కు పదవీరీత్యా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రక్షణ, హోం, ఆర్థిక శాఖల కేంద్ర మంత్రులు పదవీరీత్యా ట్రస్టీలుగా ఉంటారు. ప్రధానమంత్రి నియమించిన ఇద్దరు ట్రస్టీలుగా రిటైర్డ్ జస్టిస్ కేటీ థామస్, కరియా ముండా ఉన్నట్లు అధికారిక వెబ్‌సైట్ పేర్కొంటోంది.
ఫండ్ ఉద్దేశం ఏమిటి?
ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, మానవసృష్టి విపత్తులు, ఇతర సంక్షోభాల్లో బాధితులకు సహాయం చేయడం PM CARES Fund ప్రధాన లక్ష్యం. అవసరమైతే ఆరోగ్య సదుపాయాల ఏర్పాటు లేదా అభివృద్ధి, పరిశోధన, మౌలిక వసతులు, బాధితులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలకు నిధులు వినియోగించవచ్చని ఫండ్ అధికారికంగా చెబుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..