ప్రశాంత్ కిశోర్.. ఈ మధ్య కాలంలో ఈయన పేరు తెలియని భారతీయుడు లేడంటే అతిశయోక్తి. కొద్దిపాటి రాజకీయ పరిఙ్ఞానం వున్న ప్రతీ ఒక్కరికి ప్రశాంత్ కిశోర్ పేరు తెలుసు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ స్ట్రాటెజిస్ట్. రాజకీయ వ్యూహాలను రచించడంలో ప్రశాంత్ కిశోర్‌ది అందె వేసిన చేయి. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలను రచించడం, వాటిని సమీక్షించి మార్పులు, చేర్పులను ప్రతిపాదించడం ప్రశాంత్ కిశోర్ దిట్ట. తనకు సొంతంగా వేరే పొలిటికల్ అఫిలియెన్స్ వున్నప్పటికీ తనను హయిర్ చేసుకున్న వారికి పూర్తి స్థాయిలో వ్యూహరచన చేసి, సాయం చేయడం ప్రశాంత్ కిశోర్ స్టైల్.
తాజాగా ప్రశాంత్ కిశోర్ నజర్ తమిళనాడు మీద పడింది. జయలలిత మరణం తర్వాత రాజకీయ అనిశ్చితి ఏర్పడడం.. వచ్చే ఎన్నికల్లో డిఎంకెను ఎదుర్కొనే స్థాయిలో అన్నా డిఎంకే లేదన్న వాదనల నేపథ్యంలో ఒక వైపు కమల్ హాసన్, రజనీకాంత్‌లపై అందరి దృష్టి మళ్ళుతోంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌ను ఆల్‌రెడీ హయిర్ చేసుకున్న కమల్ హాసన్‌కు, తాజాగా తన కోసం ప్రయత్నాలు చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌లకు ప్రశాంత్ కిశోర్ షాకిచ్చాడు.
తమిళనాడు వ్యాప్తంగా తాను సొంతంగా సర్వే చేయించుకున్న ప్రశాంత్ కిశోర్ (పి.కె.) ఆ సర్వే రిపోర్టుతో కమల్ హాసన్‌ని గానీ, రజనీకాంత్‌ని గానీ కల్వలేదు. తమిళనాట అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న మరో హీరోని పి.కె. కల్వడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాము పి.కె. వెంటపడుతుంటే ఆయన ఆ హీరో వెంట పడడం కమల్ హాసన్, రజనీకాంత్‌లకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
ఇంతకీ పి.కె. కలిసిన తమిళ హీరో ఎవరని ఆలోచిస్తున్నారా ? ఎస్.. తమిళ నాట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న ఇలయ దళపతి విజయ్‌ని ప్రశాంత్ కిశోర్ కల్వడం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కమల్, రజనీలిద్దరు 70వ సంవత్సారానికి దగ్గరవుతున్న తరుణంలో యువ హీరోను రాజకీయాల్లోకి తెస్తే.. సుదీర్ఘ కాలం ఆయన రాజకీయాల్లో కొనసాగే ఛాన్స్ వుందని పి.కె. భావించడం వల్లనే విజయ్‌ని కలిసినట్లు తెలుస్తోంది.
దానికి తోడు తాను స్వయంగా నిర్వహించిన సర్వేలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు కావాలనుకుంటున్నారు ? అన్న ప్రశ్నలో జవాబుల ఆప్షన్లలో పి.కె. వ్యూహాత్మకంగా హీరో విజయ్ పేరును కూడా చేర్చారు. దాంతో ఆయన సీఎం కావాలనుకుంటున్న వారే అధికంగా వున్నట్లు తేలింది. దాంతో పి.కె. ఆ సర్వే రిపోర్టును తీసుకుని, హీరో విజయ్‌ని కలిసినట్లు సమాచారం. తమిళనాడులో అత్యధికంగా ప్రజాదరణ వున్న విజయ్‌ని రాజకీయాల్లోకి రమ్మని, తాను పూర్తిస్థాయిలో వ్యూహరచన చేసి, తమిళనాడు ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లు సమాచారం.
అయితే.. పి.కె. వివరించిన అంశాలను, చూపించిన సర్వే రిపోర్టులను మౌనంగా విన్న ఇలయ దళపతి విజయ్.. ఎలాంటి స్పందన ఇవ్వలేదని సమాచారం. దాంతో పి.కె. ఆశ్చర్యపోవడంతోపాటు మౌనంగా వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇంకా పదేళ్ళ పాటు సినిమాల్లో కొనసాగాలనుకుంటున్న విజయ్.. పి.కె. సర్వే పట్ల ముభావంగా వుండిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ లాంటి వారు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి పరిస్థితి వుంటుందో చూసుకున్న తర్వాతనే తన రాజకీయ అరంగేట్రంపై విజయ్ ఓ నిర్ణయానికి వస్తారని చెబుతున్నారు.