Terror High Alert: భారీ టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేసిన నిఘా వర్గాలు.. పంజాబ్‌లో హై అలర్ట్‌ ప్రకటించిన సీఎం

|

Sep 15, 2021 | 7:36 PM

దేశంలో ఎక్కడెక్కడ ఉగ్రకుట్ర జరిగింది. అందరిలోనూ అలజడ మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది కేంద్ర హోం శాఖ. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే టార్గెట్‌ చేస్తూ.. ముష్కరమూకలు భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారు.

Terror High Alert: భారీ టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేసిన నిఘా వర్గాలు.. పంజాబ్‌లో హై అలర్ట్‌ ప్రకటించిన సీఎం
Punjab Terror Alert
Follow us on

Punjab Terror Alert: దేశంలో ఎక్కడెక్కడ ఉగ్రకుట్ర జరిగింది. అందరిలోనూ అలజడ మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది కేంద్ర హోం శాఖ. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే టార్గెట్‌ చేస్తూ.. ముష్కరమూకలు భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారు. అయితే, అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. ఇద్దరు తీవ్రవాదులతో సహా ఆరుగురిని దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈనేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు ఏ రూపంలోనైనా దాడి చేసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను హెచ్చరించారు. స్థానికంగా ఎలాంటి అనుమానితులు కనిపించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.


ఇదిలావుంటే, దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. ఆరుగురు టెర్రరిస్టులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, వారిలో ఇద్దరు ఉగ్రవాదులు జేషన్ ఖమర్, ఆమిర్ జావేద్కు పాక్‌లోని కరాచీలో ఉగ్రశిక్షణ తీసుకున్నారు. గతంలో ముంబై దాడులకు పాల్పడ్డ అజ్మల్‌ కసబ్‌ లాంటి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన చోటే వీళ్లు ట్రైనింగ్ తీసుకుని మానవబాంబులుగా మారినట్లు తెలుస్తోంది. బాంబులు, IEDల తయారీతో పాటు కాల్పుల్లోనూ ట్రైనింగ్‌ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. వారి వెనుక అండర్‌ వరల్డ్‌ దావూద్‌ సోదరుడి హస్తం ఉన్నట్టు గుర్తించారు.

ఢిల్లీలో ఉగ్ర కుట్ర బయటపడటంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది కేంద్రం. పండుగలు నవరాత్రి వేడుకలే టార్గెట్‌గా విధ్వంసానికి వ్యూహరచన చేశారని..రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. దీంతో ఇటు హైదరాబాద్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పాకిస్తాన్ ఏజెంట్లకు రహస్యంగా సమాచారం ఇస్తున్న నలుగురు DRDO కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిషాలోని DRDO ఇంటిగ్రేటెడ్ రేంజ్‌లో ఈ నలుగురూ పనిచేస్తున్నారు. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ISD నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని పోలీసులకు ఇన్‌ఫర్మేషన్ వచ్చింది. పాక్ నుంచి అడిగిన డేటా ఇవ్వడం, ప్రతిఫలంగా నిధులు పొందడం వీళ్ల పని. ఇవి కేవలం ఆరోపణలు కాదు.. పోలీసుల దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. బాలాసోర్‌లో డేటా లీక్‌, పాక్‌ కుట్రలు ఇవాళ కొత్త కాదు.. 2014లో కూడా బాలాసోర్‌ నుంచి రహస్య సమాచారం అమ్మేస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదే క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న పంజాబ్ పోలీసులకు సరిహద్దు ప్రాంతంలో 2-3 కిలోల RDX, గ్రెనేడ్లు, 100 పిస్టల్ గుళికలను కలిగి ఉన్న టిఫిన్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. విచారణ తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కి బదిలీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ సంఘటన జరిగింది, ఆ తర్వాత రాష్ట్రం అప్రమత్తమైంది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసిన వ్యక్తులను ఎన్ఐఏ, ఇతర నిఘా సంస్థలు విచారిస్తున్నాయి.

మరోవైపు. టెర్రరిస్టులు పట్టుబడకుండా ఉండటానికి దేశంలో డ్రగ్స్, పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడానికి ఉగ్రవాద గ్రూపులు డ్రోన్‌లను ఉపయోగించడం ప్రారంభించాయని నిఘా వర్గాలు గుర్తించాయి. భారతదేశం నుండి మస్కట్‌కు వెళ్లి, పాకిస్తాన్‌లోని తట్టాలోని శిబిరంలో శిక్షణ పొంది దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అమలు చేసిన ఇతర అనుమానితుల కోసం కూడా నిఘా సంస్థలు వెతుకుతున్నాయి. ముంబై నుండి ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్టు చేసిన ఉగ్రవాద నిందితులలో ఒకరైన జాన్ మహ్మద్ షేక్ తన అపఖ్యాతి పాలైన కార్యకలాపాల కోసం ముంబై పోలీసు విజిలెన్స్‌లో ఉన్నాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోం శాఖ.

Read Also…  ఈ వ్యక్తి 70 పిల్లులతో కలిసి చిన్న గదిలో జీవిస్తున్నాడు..! కానీ చుట్టుపక్కల వారు ఇబ్బందిగా ఫీలవుతున్నారు..