దేశంలో మహిళలపై అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. ప్రతిరోజూ చాలా చోట్ల దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ.. అక్కడ… అని కాకుండా ప్రతి చోటా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా అంబులెన్స్ డ్రైవరే పేషెంట్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్‌ను తొలగించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజిపుర్‌లో చోటు చేసుకొంది. ఈ ఘటనలో పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు.
సిద్ధార్థ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఆగస్టు 28న ఘాజిపుర్‌లోని ఆరావళి మార్గ్‌లో ఉన్న ఒక ఆసుపత్రిలో భర్తను చేర్పించింది. అక్కడ ఖర్చు తట్టుకోలేక తన భర్తను ఇంటికి తీసుకెళతానని వైద్యులను అభ్యర్థించింది. దీంతో వారు ఆమెకు ఓ అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ ఇచ్చారు. సదరు మహిళ అంబులెన్స్‌లో తన భర్తను, సోదరుడిని తీసుకొని సిద్ధార్థనగర్‌లోని ఇంటికి బయల్దేరింది. ప్రయాణం ప్రారంభించే ముందు ఆ డ్రైవర్ ఆమెను తనతో పాటు ముందుసీట్లో కూర్చోవాలని.. అలా అయితే రాత్రి వేళ పోలీసులు మధ్యలో ఆపరని చెప్పాడు. దీంతో ఆమె అలానే చేసింది. మార్గమధ్యలో డ్రైవర్, అతడి సహాయకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీనికి సదరు మహిళ అభ్యంతరం తెలిపింది. మరోవైపు వీరి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త, సోదరుడు కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో చవానీ పోలీస్‌స్టేషన్‌రోడ్డులో వారు అంబులెన్స్‌ను ఆపి ఆమె భర్తను రోడ్డుపక్కనే దించేసి.. ఆక్సిజన్ తొలగించి వెళ్లిపోయారు. సదరు మహిళ వద్ద రూ.10వేల నగదు, కొన్ని ఆభరణాలు లాక్కొని వెళ్లిపోయారు. దీంతో సదరు మహిళ, ఆమె సోదరుడు 112, 108 నెంబర్లకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో తక్షణమే పోలీసులు స్పందించి అక్కడికి చేరుకొన్నారు. ఆమె భర్తను మరో ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో గోరఖ్‌పుర్ మెడికల్ కాలేజీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.