Parliament: రేపటి నుంచి పార్లమెంట్‌.. తొలిరోజే ప్రధాని సహా 280 మంది ఎంపీల ప్రమాణస్వీకారం

|

Jun 23, 2024 | 1:05 PM

18వ లోక్‌సభ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 24 ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా కొత్త ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు.

Parliament: రేపటి నుంచి పార్లమెంట్‌.. తొలిరోజే  ప్రధాని సహా 280 మంది ఎంపీల ప్రమాణస్వీకారం
Lok Sabha Session
Follow us on

18వ లోక్‌సభ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 24 ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా కొత్త ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మంత్రుల చేత ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. ప్రధాని మోదీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మంత్రి మండలిలోని ఇతర సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రధాని మోదీ కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో 58 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. కేంద్ర మంత్రి మండలిలోని 13 మంది సభ్యులు రాజ్యసభ ఎంపీలు, ఒక మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఏ సభలోను సభ్యులుగా లేరు. లోక్‌సభ ఎన్నికల్లో లూథియానా నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన బిట్టు ఓడిపోయారు. ప్రధాని మోదీ, ఆయన మంత్రుల తర్వాత ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల వారీగా ఎంపీలతో ప్రమాణం చేయిస్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం ఉండదు.

జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

అదే విధంగా మొదట మొదటిరోజు అండమాన్ నికోబార్, ఏపీ, అరుణాచల్‌, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీల ప్రమాణం చేస్తారు. రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణస్వీకారం, చివరగా పశ్చిమ బెంగాల్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 24న పార్లమెంట్ సమావేశాల తొలిరోజు కొత్తగా ఎన్నికైన 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండో రోజు అంటే జూన్ 25న కొత్తగా ఎన్నికైన 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణస్వీకారానికి ఒక నిమిషం సమయం కేటాయిస్తారు. ఆ తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇటీవలి నీట్ పేపర్ లీక్‌పై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించినప్పటికీ జూన్ 28న రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

జూలై 2న లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం..

రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిస్పందనగా ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న లోక్‌సభలో ప్రసంగించనున్నారు. జూలై 3న రాజ్యసభలో మాట్లాడనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని కటక్‌కు చెందిన బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు జూన్ 20న తెలిపారు. స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్‌కు సహాయంగా సురేష్ కోడికున్నిల్, తాళికోట్టై రాజుతేవర్ బాలు, రాధా మోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయలను రాష్ట్రపతి నియమించారు.

ఇదిలావుంటే, పార్లమెంటు దిగువ సభ అంటే లోక్‌సభలో బీజేపీకి స్పీకర్ పదవి లభించే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్‌డీఏ మిత్రపక్షాలలో ఒకరికి ఇవ్వవచ్చు. సాంప్రదాయకంగా ఎప్పుడూ ప్రతిపక్షానికి వెళ్లే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. అయితే 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ లేరు. అయితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రెండూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…