Parliament Security Breach: పక్కా ప్లాన్‌తోనే పార్లమెంట్‌లో కలర్‌స్మోక్‌ దాడి.. ఆ నలుగురు ఎవరు..?

|

Dec 13, 2023 | 4:26 PM

Parliament Security Breach: రెండు సంఘటనలు - నలుగురు వ్యక్తులు - పార్లమెంట్‌పై దాడి జరిగి 22 సంవత్సరాలు అయిన వేళ, సరిగ్గా అదే రోజున లోక్‌సభలో మరోసారి భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. లోక్‌సభ జీరో ఆవర్ ముగింపు సమయంలో ఇద్దరు యువకులు సభలో కలకలం సృష్టించారు. సభ వెలుపల మరో ఇద్దరు హడావుడి చేశారు.

Parliament Security Breach: పక్కా ప్లాన్‌తోనే పార్లమెంట్‌లో కలర్‌స్మోక్‌ దాడి.. ఆ నలుగురు ఎవరు..?
Parliament Security Breach
Follow us on

Parliament Security Breach: రెండు సంఘటనలు – నలుగురు వ్యక్తులు – పార్లమెంట్‌పై దాడి జరిగి 22 సంవత్సరాలు అయిన వేళ, సరిగ్గా అదే రోజున లోక్‌సభలో మరోసారి భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. లోక్‌సభ జీరో ఆవర్ ముగింపు సమయంలో ఇద్దరు యువకులు సభలో కలకలం సృష్టించారు. సభ వెలుపల మరో ఇద్దరు హడావుడి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం సమయంలో లోక్‌సభలో చివరి వరుసలో కూర్చున్న బెంగాల్‌ బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్ము తన నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్న సమయంలో హఠాత్తుగా ఏదో కింద పడ్డ శబ్ధం వినిపించింది. ఏంటా అని సభ్యులు చూస్తున్న సమయంలోనే ఒక యువకుడు వేగంగా ఎంపీలు కూర్చునే టేబుల్స్‌పై నుంచి దూకుతూ స్పీకర్‌ స్థానం వైపు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ కలకలం గమనించి సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్‌ స్పీకర్‌ రాజేంద్ర అగర్వాల్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

టేబుల్స్‌ ‌పై నుంచి ఆ యువకుడు దూకుతున్న సమయంలో ఆ టేబుల్స్‌పై ఎంపీలు ఎవరూ లేరు. ఈ లోపు ఆ యువకుడు ఐదు టేబుల్స్‌ పై నుంచి జంప్‌ చేస్తూ ముందుకు దూకాడు. పట్టుకోండి, పట్టుకోండి అంటూ సభ్యులు అరిచారు. ఈ లోపు అప్రమత్తమైన ఎంపీలు అతన్ని చుట్టి ముట్టారు. ఈ లోపు పది మంది ఎంపీలు నాలుగు వైపులా నుంచి చుట్టుముట్టి ఆ యువకుడిని పట్టుకున్నారు. ఇదే సమయంలో మరో యువకుడు విజిటర్స్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకి కలర్‌ స్మోక్‌ వదలడం మొదలుపెట్టాడు. పసుపు రంగుతో కూడిన ఆ గ్యాస్‌ సభ అంతా నిండిపోయింది. ఆ గ్యాస్‌ చూసి చాలా మంది భయపడ్డారు. అయినప్పటికీ కొంత మంది ఎంపీలు తెగించి ఆ యువకుడిని కూడా పట్టుకున్నారు. ఈ ఇద్దరిని సాగర్‌ శర్మ, మనోరంజన్‌గా గుర్తించారు. షూ‌ సోల్‌లో వీళ్లు ఆ కలర్‌ స్మోక్‌ క్యానిస్టర్స్‌ను పెట్టుకొని వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మైసూరు ఎంపీ ప్రతాపసింహా సిఫార్సు మేరకు ఈ ఇద్దరికి విజిటర్స్‌ పాస్‌ మంజూరు చేసినట్టు తెలుస్తోంది.

సరిగ్గా పార్లమెంట్‌లో ఈ ఘటన జరిగి ఎంపీలు బయటకు వస్తున్న సమయంలో మరో యువకుడు, ఒక మహిళను పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ కూడా కలర్‌ స్మోక్‌ క్యానిస్టర్స్‌ పట్టుకొని ఎల్లో, రెడ్‌ కలర్‌ గ్యాస్‌ వదులుతూ కనిపించారు. పార్లమెంట్‌ లోపల జరిగిన ఘటన, బయట జరిగిన ఈ సంఘటన రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిన ఘటనలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పార్లమెంట్‌ వెలుపల అదుపులోకి తీసుకున్న యువకుడు మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల అన్‌మోల్‌ షిండేగా, మహిళ హర్యానాలోని హిస్సార్‌కు చెందిన 42 ఏళ్ల నీలమ్‌గా గుర్తించారు.

అదుపులోకి తీసుకున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం జరిగిందని తెలియగానే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఢిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ ఆరోరా పార్లమెంట్‌ భవనానికి వచ్చారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఫొరెన్సిక్‌ టీమ్‌ కూడా పార్లమెంట్‌ భవనానికి చేరుకుని దర్యాప్తు చేస్తోంది.

సోషల్‌ మీడియాతో నలుగురికి పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత పార్లమెంట్‌లో హంగామా చేయాలని ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియాతో ఒక్కటైన సాగర్‌ శర్మ, మనోరంజన్‌, నీలమ్‌, అమోల్‌ షిండేగా పోలీసులు గుర్తించారు. అయితే, సాగర్‌శర్మ , మనోరంజ్‌కు విజిటర్స్‌ పాస్‌ ఇవ్వడంపై ఎంపీ ప్రతాప్‌ సిన్హా క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన వాళ్లు కావడంతో పాస్‌ ఇచ్చినట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..