
కెనడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన భారత సంతతి వ్యక్తి పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గంటల తరబడి చికిత్స అందకపోవడంతో అతడు గుండెపోటుతో మరణించాడు. డిసెంబర్ 22న విధుల్లో ఉండగా తీవ్రమైన ఛాతీ నొప్పితో ప్రశాంత్ శ్రీకుమార్ (44) అనే వ్యక్తిని కెనడాలోని ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీకుమార్‌ను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో వేచి ఉండే ప్రాంతంలో దాదాపు 8 గంటలకుపైగా ఎలాంటి చికిత్స అందించకుండానే ఉంచడంతో పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. ఇది దీనితో కెనడాలో అత్యవసర ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది.
శ్రీకుమార్ ఛాతీ నొప్పి గురించి తెల్పడంతో ఓ క్లయింట్ అతన్ని ఆగ్నేయ ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతన్ని ట్రయాజ్‌లో తనిఖీ చేసి, వెయిటింగ్ రూమ్‌లో కూర్చోబెట్టారు. సమాచారం అందిన వెంటనే అతని తండ్రి కుమార్ కూడా త్వరగానే ఆసుపత్రికి చేరుకున్నారు. తండ్రిని చూసి నాన్నా.. నేను నొప్పిని భరించలేకుండా ఉన్నానని చెప్పాడని శ్రీకుమార్ తండ్రి తెలిపారు. శ్రీకుమార్ తండ్రి తెల్పిన వివరాల ప్రకారం..
శ్రీకుమార్ ఛాతీ నొప్పి గురించి ఆసుపత్రి సిబ్బందికి చెప్పడంతో వారు ఆసుపత్రి సిబ్బంది అతని గుండె పనితీరును తనిఖీ చేయడానికి అతనికి ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) చేశారు. కానీ రోగికి, అతని కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ ఏమీ లేదని చెప్పి గంటల తరబడి కూర్చోబెట్టారు. సమయం గడిచేకొద్దీ సిబ్బంది శ్రీకుమార్ నొప్పికి కొంత టైలెనాల్ ఇచ్చారు. కానీ అతని రక్తపోటు క్రమంగా పెరుగుతూనే ఉంది. 8 గంటలు గడుస్తున్నా అది పైకి, పైకి వెళ్తునే ఉంది. చివరిగా 8 గంటలకు పైగా వేచి ఉన్న తర్వాత చివరకు ట్రీట్‌మెంట్ ప్రాంతానికి పిలిచారు. అక్కడికి వెళ్లిన 10 సెకన్ల తర్వాత శ్రీకుమార్ నా వైపు చూసి, తన ఛాతీపై చేయి వేసి కుప్పకూలిపోయాడు అని శ్రీకుమార్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులు వచ్చి అతన్ని బ్రతికించడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ప్రశాంత్ శ్రీకుమార్ గుండెపోటుతో మరణించాడు. నా కుమారుడికి భార్య, మూడు, 10, 14 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లలు ఉన్నారని మీడియాకు తెలిపారు.
44 year-old man passes away in the hospital after waiting over 8 hours in the emergency room in Canadian hospital 😳💔 pic.twitter.com/bHztPMbDkH
— RTN (@RTNToronto) December 25, 2025
కాగా గ్రే నన్స్ హాస్పిటల్‌ను కోవెనెంట్ హెల్త్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్ నిర్వహిస్తుంది. మృతుడి వివరాలు అందించడానికి గ్రే నన్స్ హాస్పిటల్ నిరాకరించినట్లు గ్లోబల్ న్యూస్ సంస్థ వెల్లడించింది. అయితే ఈ కేసు చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం సమీక్షచేస్తున్నట్లు స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.