సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ జయంతి వేడుకల సందర్భంగా పాకిస్థాన్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 550వ జయంతి వేడుకల నేపథ్యంలో ఆయన స్మారకార్థం నాణేలను విడుదల చేసింది. ఈ మేరకు ఆ నాణేల ఫోటోలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. “సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్ విడుదల చేసిన నాణేం” అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఈ నాణెంతో పాటుగా, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కూడా కర్తార్‌పూర్ సాహిబ్‌లో యాత్రికులకు అందుబాటులో ఉంచబోతున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రిక పేర్కొంది.
కాగా, కర్తార్‌పూర్ కారిడార్ విషయమై గతేడాది నవంబర్ మాసంలోనే భారత్-పాక్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై వారం క్రితం ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు పూర్తిచేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి కర్తార్‌పూర్‌లోని గురు ద్వారాను ఈ కారిడార్ కలుపుతుంది. గురునానక్ జయంతి సందర్భంగా.. భారత్‌లో నవంబర్ 8న ప్రధాని మోదీ ప్రారంభించబోతుండగా.. మరుసటి రోజు నవంబర్ 9న పాక్‌లో ఈ కారిడార్ ప్రారంభం కానుంది. తొలి బృందం నవంబర్ 9న పాక్‌కు బయలుదేరుతుంది. ఇక యాత్రికుల కోసం పాక్ ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. యాత్రికుల వసతి కోసం పాకిస్థాన్ 80 ఇమ్మిగ్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రోజు.. కేవలం అయిదువేల మంది యాత్రికులను మాత్రమే అనుమతించనుంది.
ఇప్పటికే గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌కు వెళ్లే 575 మందితో కూడిన తొలిజాబితాను పాక్‌కు భారత్ అందజేసింది. ఈ బృందంలోనే మాజీ ప్రధాని మన్మోహన్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.