
“నిబద్ధత, అంకితభావం, త్యాగం లేకుండా ఏదీ రాదు. రేపటి తరాల కోసం వీరులు ఇవాళే దాన్ని కొనసాగిస్తారు”ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి రాసినవో తెలిస్తే భారతీయుడెవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఎందుకంటే కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎంతో మంది భారత సైనికుల మరణాలకు కారకుడైన బుర్హాన్ వనీ కోసమే ఈ వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం.. అంటే 2016 జూలై 8న భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో వనీ హతమయ్యాడు. అలాంటి బుర్హాన్ వనీపై పాక్ ఇప్పటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉంది. ఆదేశానికి సంబంధించి అసలైన దేశభక్తుడు వీరమరణం పొందినట్టు కలరింగ్ ఇస్తోంది. బుర్హాన్ వనీ మరణంపై పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ ఇలా ట్విట్టర్ వేదికగా బుర్హాన్ సేవల్ని కొనియాడారు.
జనరల్ ఆసిఫ్ గపూర్ ట్విట్టర్‌లో ఒక ఉగ్రవాదిని పొగడ్తలతో ముంచెత్తడం, ఆయన కశ్మీర్ ఉద్యమానికి ఎంతో సేవ చేసినట్టుగా చెప్పడం వివాదాస్పదంగా మారింది. బుర్హాన్ వనీ జస్టిస్ ఫర్ కశ్మీర్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను తన ట్వీట్‌కి జతచేసి మరింత రెచ్చగొట్టాడు గపూర్. గతంలో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా బుర్హాన్ వనీ కాశ్మీర్ లోయలో స్వేచ్ఛకోసం ఎంతో పోరాటం చేశారని వ్యాఖ్యానించారు.