Pahalgam Terror Attack: ‘నిన్ను చంపను, మోదీకి ఈ విషయం చెప్పు’.. పహల్గామ్‌లో భర్తను చంపి.. భార్యతో ఇలా..

మంచు కొండల మధ్య ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడి చేయడంతో తెల్లని మంచుకొండలు ఎరుపెక్కాయి. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 30 మంది మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో కర్ణాటకకు చెందిన మంజునాథ్ కూడా మరణించాడు. తన భర్తను ఉగ్రవాదులు చంపారని అతని భార్య పల్లవి చెప్పింది. అంతేకాదు తనని ఉగ్రవాదులు చంపబోమని.. ఈ ఉగ్రదాడి గురించి మోడీకి చెప్పు అంటూ వదిలేశారు అని పల్లవి చెప్పింది.

Pahalgam Terror Attack: నిన్ను చంపను, మోదీకి ఈ విషయం చెప్పు.. పహల్గామ్‌లో భర్తను చంపి.. భార్యతో ఇలా..
Pahalgam Terror Attack

Updated on: Apr 23, 2025 | 8:29 PM

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 30 మంది మరణించినట్లు భావిస్తున్నారు. ఇంకా చాలా మంది గాయపడ్డారు. ఈ దాడిలో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. సెలవుల్లో తన ఫ్యామిలీతో కలిసి మంచు అందాల మధ్య సంతోషంగా గడిపేందుకు మంజునాథ్ తన కుటుంబంతో కలిసి పహల్గామ్‌కు వెళ్ళినట్లు తెలుస్తోంది. మంజునాథ్.. భార్య పల్లవి, కుమారుడు తో కలిసి విహార యాత్రకు వెళ్ళారు. ఈ దాడి గురించి ప్రత్యక్ష సాక్షిగా పల్లవి నిలిచింది. తన ఎదుటే భర్తని పోగొట్టుకున్న పల్లవి హృదయ విదారకంగా విలపిస్తూ.. ఉగ్రవాదులు ఐడీ కార్డ్ అడిగి మరీ హిందువులని తెలుసుకుని కాల్చి చంపినట్లు పల్లవి చెప్పింది.

ఉగ్రవాదుల దాడికి ముందు మంజునాథ్, పల్లవి దంపతులు పహల్గామ్‌లో సంతోషంగా గడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అప్పుడు ఆ మంజు నాథ్ కు తెలియదు.. తనకి మరణం సమీపిస్తుందని.. ఆ భార్యకు తెలియదు.. తన భర్తతో సంతోషంగా గడిపే చివరి క్షణాలు ఇవే అని..

ఇవి కూడా చదవండి

 

ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మంజునాథ్ భార్య పల్లవి ఇంకా మాట్లాడుతూ.. ఉగ్రవాదులు తన భర్తను చంపినప్పుడు.. నేను, నా కొడుకుతో అక్కడే ఉన్నాను.. నేను ఉగ్రవాదులకు మీరు నా భర్తను చంపారు.. ఇప్పుడు నన్ను కూడా చంపండి అని అన్నానని పల్లవి చెప్పింది. అయితే ఒక ఉగ్రవాది నేను నిన్ను చంపను అని అన్నాడు. అంతేకాదు మేము చేసిన దాడి గురించి మోడీకి చెప్పు అందుకే నిన్ను విడిచి పెడుతున్నాం అని చెప్పాడు. ఉగ్రవాదుల దాడి తర్వాత.. స్థానిక ప్రజలు మాకు సహాయం చేయడానికి వచ్చారు. ముగ్గురు స్థానికులు క్షతగాత్రుల ప్రాణాలను కాపాడారు.

ఉగ్రవాదులను వదిలిపెట్టబోమన్న ప్రధాని మోడీ.

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఉగ్రవాద దాడిని ఖండించారు. ఈ దారుణమైన చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకువస్తామని ఆయన అన్నారు. ఉగ్రవాదులను వదిలిపెట్టబోము. వారి దుర్మార్గపు ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం దృఢమైనది. అది మరింత బలపడుతుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహాయం అందించడం జరుగుతోందని చెప్పారు.

దోషులకు అత్యంత కఠినమైన శిక్ష పడుతుంది

దాడి తర్వాత ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోమ్ మంత్రి అమిత్ షాని కోరారు. ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుందని పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..