భారత్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేసిందా..? ప్రధాని మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులతో వరుస భేటీలు

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ , హాజరయ్యారు. CDS అనిల్‌ చౌహాన్‌, NSA అజిత్‌ దోవల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు భద్రతపై ఈ సమావేశంలో చర్చించారు. పహాల్గామ్‌ దాడి తరువాత ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ రగిలిపోతోంది భారత్.

భారత్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేసిందా..? ప్రధాని మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులతో వరుస భేటీలు
Pm Modi Meet All Armed Forces Chiefs

Updated on: Apr 29, 2025 | 6:56 PM

ఢిల్లీలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ కూడా హాజరయ్యారు. అంతకుముందు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది, దీనిలో కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, సరిహద్దు భద్రతా దళం, అస్సాం రైఫిల్స్, జాతీయ భద్రతా గార్డుల డైరెక్టర్ జనరల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు SSB సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

పాకిస్తాన్ గడ్డపై పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని పహల్గామ్ దాడి మరోసారి రుజువు చేసింది. ఈ సంఘటన తర్వాత యావత్ దేశం ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనకు నిరసనగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు సైతం మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేసేసింది. పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ రగిలిపోతున్న భారత్.. ముందుగా ఓ హిట్‌లిస్ట్‌ని ప్రిపేర్‌ చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఆ జాబితాలో 14 మంది ఉగ్రవాదుల వివరాలను సేకరించింది భారత నిఘా సంస్థ. ముఖ్యంగా ఆ టెర్రరిస్టులకు లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తేల్చేసింది భారత ప్రభుత్వం. ఆ 14 మందిలోనూ.. 8 మంది ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థ తరపున పనిచేస్తున్నారు. మరో ముగ్గురు జైష్‌ ఏ మహ్మద్‌ గ్రూప్‌కు చెందిన వారు. మిగిలిన ముగ్గురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కోసం విధ్వంసం సృష్టిస్తుంటారు. ఇక ఉగ్రవాదులతోపాటు, వారి వెనుక ఉన్నవారి కోసం భారత్ వేట మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే త్రివిధ దళాధిపతులతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు.

వీడియో చూడండి.. 

మరోవైపు మూసివేసిన పర్యాటక ప్రాంతాల్లో త్వరలో భద్రత కల్పించనుంది కేంద్రం. ఆ తర్వాతే ఆయా ప్రాంతాలను పర్యాటకులకు ఓపెన్‌ చేయనుంది. ఇక, ఉగ్ర దాడి తర్వాత వెలవెలబోయిన పహల్గామ్‌కు మళ్లీ టూరిస్టుల రాక మొదలైంది. గుల్మార్గ్, సోన్​మార్గ్, దాల్ లేక్​ లాంటి పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేశారు. యాంటీ ఫిదాయీన్​ స్క్వాడ్స్‌తో పాటు జమ్మూకశ్మీర్​ పోలీసులను మోహరించారు.

ఇదిలావుంటే, భారత్‌ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాక్‌ ఆర్మీ వణికిపోతోంది. తమపై భారత్‌ వైమానిక దాడులకు దిగొచ్చని సైన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌ ఆర్మీలో చాలా మంది సైనికులు, అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో భారత్‌తో యుద్ధానికి దిగితే పాకిస్తాన్‌కు అంతిమ ఘడియలు తప్పవు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా పాకిస్థాన్ అనే పేరు కనిపించకుండా చరిత్ర పుస్తకాల్లో ఒక పాత అధ్యాయంలా మిగిలిపోతుందన్న భయం పట్టుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..