Pahalgam Attack: ఉగ్రవాది నుంచి పర్యాటకుడి ప్రాణాలు కాపాడేందుకు పోరాడిన హార్స్ రైడర్.. తుపాకీకి బలి

జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్‌ మంగళవారం వరకూ ఎంతో ప్రశాంతంగా ఉన్న అందమైన ప్రాంతం. భూతల అందాలతో పర్యాటకులను అలరించే ప్రదేశంలో ఉగ్రవాదుల దాడితో ఒక్కసారిగా ఉల్కిపడింది. ఆటపాటలతో సందడిగా గుడుపుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉగ్రదాడి జరగడంతో పర్యాటకులు భయబ్రాంతులకు గురయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించుకునేందుకు పర్యాటకులు పరిగెత్తుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక పోనీ హార్స్ రైడర్ ఆసాధారణ దైర్యసాహసాలను ప్రదర్శించాడు. చివరికి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

Pahalgam Attack: ఉగ్రవాది నుంచి పర్యాటకుడి ప్రాణాలు కాపాడేందుకు పోరాడిన హార్స్ రైడర్.. తుపాకీకి బలి
Pahalgam Pony Wallah

Updated on: Apr 24, 2025 | 7:52 AM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ సమీపంలోని బైసరన్‌ అనే అందమైన ప్రదేశంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఇది ట్రెక్కింగ్‌ని ఇష్టపడే వారికి స్వర్గధామం. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే నడక, గుర్రపుస్వారీ తప్ప మరో రవాణా సదుపాయలను ఆశ్రయించాల్సిందే. దీంతో అక్కడ పోనీ హార్స్ రైడర్స్ పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటారు. ఈ ప్రాంతంలో సడెన్ గా పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు జరపడంతో .. కాల్పుల నుంచి తప్పించుకోవడానికి పర్యాటకులు పరుగెత్తుతుండగా.. ఒక పోనీ రైడ్ ఆపరేటర్ ఉగ్రవాదులలో ఒకరి నుంచి రైఫిల్‌ను లాక్కోవడానికి ప్రయత్నించి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు.

పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానానికి తన గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్లిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా.. పర్యాటకులను రక్షించడానికి ఉగ్రవాదుల్లోని ఒకడితో పోరాడటానికి ప్రయత్నించాడు. అప్పుడు ఉగ్రవాదులు ఆదిల్ కాల్చి చంపబడ్డాడు. తాను తీసుకువచ్చిన పర్యాటకుడిని రక్షించడానికి ప్రయత్నించి ఉగ్రవాదుల చేతుల్లో హతం అయ్యాడు. మతం అడిగి మరీ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదుల దాడిలోచంప బడిన ఏకైక స్థానిక వ్యక్తీ ఆదిల్ షా.. మృతితో అతడి కుటుంబం రోడ్డున పడింది.

ఆదిల్ షాకు వృద్ధ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. ఆదిల్ ఆ కుటుంబానికి ఏకైక జీవనాధారం. కొడుకును కోల్పోయినందుకు తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అదే సమయంలో కుటుంబ భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ ఆ కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆదిల్ తండ్రి సయ్యద్ హైదర్ షా ANI కి మాట్లాడుతూ.. తన కొడుకు నిన్న పని మీద పహల్గామ్ వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి గురించి తమకు తెలిసింది. మేము అతనికి కాల్ చేసాము.. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తరువాత సాయంత్రం 4.40 గంటలకు ఫోన్ రింగ్ అయింది.. అయితే ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అపుడు మేము పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసినప్పుడు.. ఉగ్రదాడిలో కాల్చి చంపబడ్డాడని తెలిసిందని చెప్పాడు. ఈ దాడి బాధ్యులు ఎవరైనా అందుకు తగిన శిక్ష విధించాలని.. తమ కుటుంబాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..