Inter-caste marriage: ఉప్పెన సినిమా విలన్‌ని మించి కరుడుగట్టినోడు.. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని..

|

Apr 16, 2023 | 8:04 PM

పరువు పోతే ప్రాణం పోయినట్టేనా? కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోతుందా? అసలు పరువు అంటే ఏమిటి? కంటికి కనిపించని పరువు కోసం కంటి ముందున్న తనవాళ్లను అడ్డంగా నరికేశాడు దండపాణి. కన్న కొడుకును, కన్నతల్లిని నరికి నరికి చంపాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన కోడలు చావుతో పోరాడుతోంది. పరువు పరువు అంటూ పాకులాడి తన అనుకున్న వాళ్ల పట్ల యమదండపాణిగా మారాడు.

Inter-caste marriage: ఉప్పెన సినిమా విలన్‌ని మించి కరుడుగట్టినోడు.. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని..
Dhandapani - Subhash ( Image: TheNewsMinute )
Follow us on

ఉప్పెన సినిమాలో విలన్‌ గుర్తున్నాడా? ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు వేరే కులానికి చెందిన యువకుడితో ప్రేమ పెళ్లి అంటూ వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక అత్యంత క్రూరంగా వ్యవహరిస్తాడు. రియల్‌ స్టోరీలో దండపాణి కూడా అలాంటోడే. ఇది… తరతరాల నుంచి పెరిగి పెద్దదై బుర్రలో పేరుకుపోయిన కుల అహంకార వికృత స్వరూపం. పరువు పోతే ప్రాణం పోయినట్టే అనుకునే మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది. పరువు పేరుతో ప్రాణాలు తీసింది. మట్టి బుర్రలో నాటిన కుల విత్తనం మొలకెత్తి విష వృక్షంగా మారి మెదళ్లలోనే ఊడలు దించుకుని మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతోంది. ఈ కుల పిచ్చి ఊడల మర్రిలా మారి జడలు విప్పుకున్న రాక్షసత్వంగా మారితే…ఇదిగో ఇలాగే నెత్తురు చిందుతుంది. ఆనందంగా సాగిపోతున్న కుటుంబంలో నెత్తుటి ఏరులు పారుతాయి. కనపడని పరువు కోసం కనిపించే తనవాళ్లను పరాయివాళ్లుగా మార్చి పాశవికంగా హత్య చేయిస్తుంది.

తప్పు చేస్తే దండించేవాడు తండ్రి…తప్పు చేయకపోయినా కులాంతర వివాహం తప్పనుకున్న తప్పుడు భావనతో అతగాడు కుటుంబం పట్ల యమదండపాణిగా మారిపోయాడు. ఇంట్లో అందరు అక్షింతలు వేసి ఆమోదించి ఆశీర్వదించినా అతగాడిలో నిద్రిస్తున్న కుల సర్పం మాత్రం ఊరుకోలేకపోయింది. లేచి బుసలు కొట్టింది. అంతే కన్న కొడుకును, కన్నతల్లిని నరికేశాడు. తమిళనాడులో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. కృష్ణగిరి జిల్లాలో ఒకే నెలలో రెండు పరువు హత్యలు జరగడం కలవరం కలిగిస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్నాడని కన్నకొడుకుని నరికి చంపేశాడు ఓ తండ్రి. కొడుకు ప్రేమ పెళ్లికి మద్దతుగా నిలిచిన తన కుటుంబ సభ్యులను కూడా నరికేశాడు దండపాణి. ఈ దాడిలో దండపాణి తల్లి కన్నమ్మ కూడా చనిపోయింది. కోడలు అనూష పరిస్థితి విషమంగా ఉంది. క్రిష్ణగిరి జిల్లా ఉతంగరై లో జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. కొడుకు పెళ్లి జరిగిన మూడు నెలల తర్వాత దండపాణి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.

సుభాష్, అనూష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందినవాళ్లు. అనూష దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి. దీంతో సుభాష్‌ తండ్రి దండపాణి పెళ్లికి ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యుల మద్దతుతో తండ్రిని ఎదిరించి సుభాష్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి కొడుకుతో పాటు కుటుంబ సభ్యులపై పట్టరాని కోపంతో రగిలిపోతున్నాడు దండపాణి. తిరుప్పూర్‌లో పని చేసే సుభాష్‌ తల్లిని చూడడానికి సొంత ఊరికి వచ్చాడు. ఈ క్రమంలో సుభాష్‌ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో…కోడలు అనూషపై దండపాణి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన కొడుకు సుభాష్‌, తల్లి కన్నమ్మపై కూడా అతగాడు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో సుభాష్‌, కన్నమ్మ మృతి చెందారు. కోడలు అనూష తీవ్రంగా గాయపడి సేలం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతోనే కొడుకును హత్య చేశానని చెబుతున్న దండపాణి పోలీసులకు లొంగిపోయాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..