Operation Sindhu: 5 రోజుల్లో 8 విమానాల్లో 1700 మంది.. యుద్ధభూమి నుంచి స్వదేశానికి..!

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకరయుద్ధం.. రోజురోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో విరుచుకుపడుతోంది ఇరాన్‌. దీంతో ఇజ్రాయెల్‌ నుంచి భారతీయులను ఆగమేఘాలపై తరలిస్తోంది కేంద్రప్రభుత్వం. 36 ఏళ్లనుంచి ఇజ్రాయెల్‌లో ఉంటున్నాం.. ఎన్నోసార్లు ఉద్రిక్తతలు ఏర్పడ్డా.. ఇంతటి పరేషాన్ ఎప్పుడూ లేదు.. ఇప్పటికైనా స్వదేశానికి తిరిగొస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటూ ఎమోషన్ ఔతున్నారు ఇండియన్స్.

Operation Sindhu: 5 రోజుల్లో 8 విమానాల్లో 1700 మంది.. యుద్ధభూమి నుంచి స్వదేశానికి..!
Operation Sindhu

Updated on: Jun 23, 2025 | 9:45 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్లు తగ్గలేదు. 11 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అక్కడి జనజీవనం భయానకంగా మారింది. జెరూసలెం లాంటి కొన్ని నగరాలైతే ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు . ఇటు.. యుద్ధభూమి నుంచి భారత పౌరులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. ఐదు రోజుల్లో ఇరాన్ నుంచి ఎనిమిది విమానాల్లో 1700 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 162 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ సరిహద్దు దాటి వచ్చారు. టెల్‌అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయంనుంచి బస్సుల్లో భారతీయులను జోర్డాన్‌కి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్నారు.

అటు.. ఇరాన్ నుంచి ఇజ్రాయిల్ నుంచి సొంత రాష్ట్రాలకు వస్తున్నారు తెలుగువారు. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి నలుగురు, ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు విద్యార్థులు తిరిగివచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న విద్యార్దులకు తోడుగా నిలబడి అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు తెలంగాణ భవన్ అధికారులు. సోమవారం సాయంత్రం నాలుగున్నరకు 291 మందితో ఒక విమానం, రాత్రి పదకొండున్నరకు 165 మందితో ఒక విమానం ఢిల్లీకి చేరుకున్నాయి. ఇందులో వచ్చే మొత్తం 18 మంది తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే బిహార్‌ శివాన్ జిల్లాకు ఓ కుర్రాడు ఇరాన్‌లో మిస్సయ్యాడు. ఇంజనీరింగ్ చదువుకున్న పాతికేళ్ల సిరాజ్ అలీ అన్సారీ ఒక పెట్రోలియం కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా చేరాడు. జూన్ 9న సౌదీ అరేబియా నుంచి ఇరాన్ చేరుకున్నాడు. జూన్ 17న మధ్యాహ్నం తర్వాత అతడితో కమ్యూనికేషన్ తెగిపోయింది. తమవాడి ఆచూకీ చెప్పాలంటూ భారత ప్రభుత్వానికి వేడుకుంటోంది అతడి కుటుంబం.