Viral: మహిళకు ఆగకుండా వాంతులు.. టెస్టులు చేయగా.. కడుపులో అడుగు పొడవైన

ఆ మహిళకు మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండదు. దీంతో ఆమెను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఇంటి పట్టునే ఉంచుతున్నారు. అయితే ఆమె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్రమైన కడుపునొప్పి.. అదే పనిగా వాంతులు అవ్వడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Viral: మహిళకు ఆగకుండా వాంతులు.. టెస్టులు చేయగా.. కడుపులో అడుగు పొడవైన
X Ray (Representative image)

Updated on: May 25, 2025 | 3:37 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో వైద్యులు ఒక అరుదైన కేసును డీల్ చేశారు. ఒక మహిళ  తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులతో ఆసుపత్రికి వచ్చింది. ప్రాథమిక పరీక్షలు చేయగా.. కడుపులో ఏదో ఉందని గుర్తించారు. అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి పరీక్షల అనంతరం అది మానవ జుట్టుతో ఏర్పడి ఉండగా నిర్ధారించారు. ఈ సంఘటన మండీ జిల్లాలోని నేర్ చౌక్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. బాధితురాలు మానసిక రుగ్మతలతో బాధపడుతూ, అనేక సంవత్సరాలుగా తన జుట్టును తానే తినటం వల్ల ఆ జుట్టు ఒక బాల్‌లా కడుపులో పేరుకుపోయింది. డాక్టర్ రాహుల్ మృగ్పురి, డాక్టర్ అజయ్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. డాక్టర్ ష్యామ్లీ, డాక్టర్ పంకజ్.. నర్సింగ్ సిబ్బంది చంద్ర జ్యోతి, డింపుల్ లాంటి వారు ఈ సర్జరీలో కీలక భూమిక పోషించారు. ఆపరేషన్ విజయవంతమైందని.. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అరుదైన వైద్య పరిస్థితి

ఈ అరుదైన పరిస్థితిని ట్రైకోబేజోర్ అని వైద్యులు పిలుస్తారు. ఇది చాలా అరుదుగా కనిపించే వ్యాధి. ఇందులో జుట్టు లేదా ఇతర జీర్ణించలేని పదార్థాలు కడుపులో చేరి పెద్ద బాల్‌ మాదిరిగా మారతాయి. సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజనీష్ శర్మ ఈ కేసు అరుదైనదిగా పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో ఉన్న అవగాహన లోపమే ఇలాంటి సమస్యలకు దారితీస్తుందని వివరించారు.

ఇలాంటి మరో ఘటన

ఇటీవల, 2025 ఫిబ్రవరిలో అదే మెడికల్ కాలేజీలో మరో పేషెంట్ కడుపులో నుండి చాకులు, గింజలు, స్పూన్లు వంటి అనేక వస్తువులను తొలగించారు.  మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల సరైన శద్ద చూపకపోవడం వల్ల ఇలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.