ఒడిశా రైలు ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు.. ’40 మృతదేహాలపై కనిపించని గాయాలు’

|

Jun 06, 2023 | 4:46 PM

ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన బోగీలు బోల్తా పడ్డాయి. దాదాపు 278 మంది మృతి చెందగా.. 1100లకు పైగా గాయాపడ్డారు. అనేక మృత దేహాలు గుర్తుపట్టలేనంతగా..

ఒడిశా రైలు ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు.. 40 మృతదేహాలపై కనిపించని గాయాలు
Odisha Train Tragedy
Follow us on

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన బోగీలు బోల్తా పడ్డాయి. దాదాపు 278 మంది మృతి చెందగా.. 1100లకు పైగా గాయాపడ్డారు. అనేక మృత దేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఈ ప్రమాదంపై నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో పలు షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నుంచి వెలికితీసిన 40 మృత దేహాలకు ఎటువంటి గాయాలు కాలేదు. ఎక్కడా కనీసం రక్తస్రావం అయిన ఆనవాళ్లు కూడా లేవని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఓ ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో లైవ్ ఓవర్ హెడ్ వైర్లు తెగి బోగీలపై పడటంతో వారంతా విద్యుదాఘాతంతో మరణించి ఉంటారని, ఓవర్‌హెడ్ విద్యుత్ వైర్లు తెగిపడిన కొన్ని సెకన్లలోనే విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉందని ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ ఎక్స్ మేనేజర్‌ పూర్ణ చంద్ర మిశ్రా అభిప్రాయపడ్డారు.

హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ (బెంగళూరు)-హౌరా ఎక్స్‌ప్రెస్‌లకు గత శుక్రవారం సాయంత్రం 6.55 గంటలకు జరిగిన ప్రమాదంలో ఓవర్‌హెడ్ వైర్‌ తెగి రైలు బోగీలపై పడి ఉంటుందని, షాక్‌కు గురై చాలా మంది మరణించినట్లు సబ్-ఇన్‌స్పెక్టర్ పాపు కుమార్ నాయక్ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఓవర్‌హెడ్ ఎల్‌టి (తక్కువ టెన్షన్) లైన్‌ వైర్లు కారణంగా చాలా మంది ప్రయాణికులు గాయపడ్డట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ (EI) సిస్టమ్’లో పనిచేసే వ్యక్తుల నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రమాదం సంభవించిందని కేసు నమోదైంది.

మరోవైపు ఈ కేసు దర్యాప్తుకు డీఎస్పీ ర్యాంక్‌ అధికారి నేతృత్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు ఆదేశాలు జారీ అయ్యాయి. సీబీఐ బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు పేర్కొనకపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.