లైంగిక దాడి కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ కస్టడీని జూన్ నెల 10వ తేదీ వరకు పొడిగించింది కోర్టు. ప్రజ్వల్‌ను ఈ కేసులో మరింత లోతుగా విచారిస్తామని సిట్ అధికారులు వెల్లడించారు.
లైంగిక దాడి కేసులో అరెస్టయిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సిట్ కస్టడీని జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది బెంగళూర్ కోర్టు. చాలామంది మహిళలపై అత్యాచారం చేసినట్టు ప్రజ్వల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. హసన్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. రేప్ కేసులో ప్రజ్వల్‌ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు సిట్ తరపు న్యాయవాది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు ప్రజ్వల్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది.
జర్మనీ నుంచి తిరిగి రాగానే మే 31 తేదీన సిట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు విభిన్నమైన వైద్యపరీక్షలు నిర్వహంచారు. అయితే ప్రజ్వల్‌కు లైంగిక పటుత్వ పరీక్షలు చేశారన్న వార్తల్లో నిజం లేదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. రేప్ కేసుల్లో నిందితులకు చేయాల్సిన వైద్య పరీక్షలు మాత్రమే చేసినట్టు స్పష్టం చేశారు. తన ఇంట్లో పనిమనిషితో పాటు పలువురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి రేవణ్ణపై కేసు నమోదయ్యింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వందలాది అశ్లీల టేపులు బయటపడడం సంచలనం రేపింది. దీనిపై కర్నాటక ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటున్నారు ప్రజ్వల్. దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం మాత్రం తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు రెండు సీట్లు లభించాయి. కుమారస్వామి మాండ్యా నుంచి గెలుపొందారు. కర్నాటకలో లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.