మన ‘జాతిపిత’ ఎవరు అంటే ఎవరైనా ఇట్టే చెబుతారు. కానీ ఇప్పుడు అంత గొప్ప బిరుదుతో ప్రధాని నరేంద్ర మోదీ పిలిపించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టిన రోజు సందర్భంగా మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆమె తన ట్వీట్‌లో మోదీని జాతిపితగా అభివర్ణించారు. ఇక తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా మోదీని జాతిపిత అంటూ సంబోధించారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడే జాతిపితగా పిలిచారంటే సంతోషించాలి కదా అన్నారు. మోదీని అలా కీర్తించడ భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ఏవైనా దీన్ని స్వాగతించాలన్నారు. ఇప్పటివరకు ఏ దేశ ప్రధానిని కూడా ట్రంప్ అలా ప్రశంసించలేదు అని, మొదటిసారి ఆయన మోదీని కీర్తించారన్నారు. దానితో పాటే ట్రంప్ జాతిపిత అనే ప్రశంసను గర్వంగా ఫీల్ కాకపోతే.. అలాంటి వాళ్లు అసలు భారతీయులే కాదన్నారు ఈ బీజేపీ మంత్రి.