
ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్యం కాదని, అసలు ముప్పు కాంగ్రెస్‌కు ఉందని అన్నారు. రెండేళ్లు, అంత కంటే ఎక్కువ జైలుశిక్ష పడిన ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వం రద్దు కావడం దేశంలో ఇది మొదటిసారేం కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పెషల్ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్, కాంగ్రెస్ తీరును ప్రశ్నిస్తూ కిషన్ రెడ్డి మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజమ్‌ఖాన్ ఎమ్మెల్యే సభ్యత్వం ఇటీవల రద్దైన విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. కోర్టు తీర్పు కారణంగా తమిళనాడు సీఎం జయలలిత కూడా తన సభ్యత్వాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చిలుకపలుకు పలుకుతున్న రాహుల్ గాంధీ ఒకసారి చరిత్రలోకి చూడాలని కిషన్‌రెడ్డి కోరారు. ఆర్టికల్ 356ను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దుర్వినియోగం చేసిన విషయం మర్చిపోయారా అని రాహుల్‌ను ప్రశ్నించారు. ఎన్నికైన రాష్ట్రప్రభుత్వాలను 75 సార్లు పడగొట్టిన ఘనత రాహుల్ గాంధీ కుటుంబానిదని అన్నారు. సొంత ప్రభుత్వపు ఆర్డినెన్స్‌ను చించి పారేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు గగ్గోలు పెట్టడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న అభ్యంతర వ్యాఖ్యలకు మద్దతిస్తున్న ఇతర రాజకీయ పార్టీల తీరును కిషన్‌రెడ్డి తప్పుబట్టారు.
కోర్టులు, కోర్టు తీర్పులను వ్యతిరేకించే రాహుల్ గాంధీ కుటుంబం నైతిక హక్కును కోల్పోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. భారత వ్యవస్థలను, భారత్‌ను కించపరచడం రాహుల్ గాంధీకి హాబీగా మారిందని ఆరోపించారు. 2013 నుంచి దేశవ్యాప్తంగా అనర్హత వేటు పడిన ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లను కిషన్ రెడ్డి ఈ ప్రకటనలో పొందుపరిచారు. కోర్టు తీర్పు కారణంగా ఒక సభ్యుడి సభ్యత్వం రద్దైతే దాని వల్ల భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం