మోదీని వ్యతిరేకిస్తాం.. దేశంపై పరాయివాళ్ల పెత్తనం సహించం.. మస్క్‌కు ఒవైసీ మాస్ కౌంటర్!
భారత మార్కెట్, విధానాలపై ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు ఒవైసీ ఘాటుగా బదులిచ్చారు. మోడీని వ్యతిరేకించినా, దేశ సార్వభౌమాధికారంపై విదేశీయుల పెత్తనాన్ని సహించబోమన్నారు. మస్క్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలకు వాడగా, ఒవైసీ జాతీయ ప్రయోజనాలను స్పష్టం చేశారు. ఈ వివాదం భారత్‌లో విదేశీ ప్రభావం, కార్పొరేట్ పారదర్శకతపై చర్చకు దారితీసింది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారతదేశ నిర్ణయాలపై విదేశీ వ్యాపారవేత్తలు పెత్తనం చెలాయించడాన్ని అంగీకరించబోమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన వైఖరి ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మస్క్ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
భారత్‌లో తన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ వాణిజ్య సేవలను ప్రారంభించేందుకు అనుమతులు పెండింగ్‌లో ఉండటంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత మార్కెట్లోకి ప్రవేశించకుండా శక్తివంతమైన వ్యాపార ప్రయోజనాలు అడ్డుపడుతున్నాయనే ఆరోపణలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని ఉద్దేశించి భారతదేశంలో అసలైన అధికారం ఎవరికి ఉందనే ప్రశ్నను కూడా లేవనెత్తారు.
బీజేపీ జాతీయవాదంపై ఒవైసీ ప్రశ్నలు
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనంతరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఒవైసీ.. మోదీని వ్యతిరేకించడం వేరు, దేశ వ్యవహారాల్లో విదేశీయుల జోక్యాన్ని సమర్థించడం వేరని పేర్కొన్నారు. ప్రధానమంత్రిని విమర్శించే హక్కు తనకు ఉన్నప్పటికీ, భారతదేశ విధానాలను ఒక విదేశీ వ్యాపారవేత్త శాసించడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు.
జాతీయవాదాన్ని తరచూ ప్రస్తావించే బీజేపీ.. విదేశీ పారిశ్రామికవేత్తల ఒత్తిడిని ఎదుర్కోవడంలో అదే స్థాయిలో దృఢంగా వ్యవహరించాలని సవాల్ విసిరారు. భారత పౌరులు, కార్మికుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యంగా ఉండాలని అన్నారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడిని ప్రస్తావిస్తూ, భారతదేశం తన ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
రాహుల్ గాంధీ భిన్నమైన స్పందన
మరోవైపు, మస్క్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు ఉపయోగించుకున్నారు. భారతదేశంలో అసలైన అధికారం ఎవరికి ఉందనే మస్క్ ప్రశ్నకు స్పందిస్తూ, ఇంకా ఎవరో తెలుసుకోవాల్సి ఉందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వానికి కొందరు పారిశ్రామికవేత్తలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఈ పరిణామాన్ని అనుసంధానించారు. దీనిపై మస్క్ కూడా స్పందించారు.
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న వివాదం
ఒకవైపు కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసే విధానంలో పారదర్శకత, సమానత్వం ఉండాలనే ప్రశ్న ఉండగా.. మరోవైపు దేశ విధానాలపై విదేశీ వ్యాపారవేత్తల ప్రభావం ఎంతవరకు ఉండాలనే అంశం ముందుకొచ్చింది. రాహుల్ గాంధీ కార్పొరేట్ ప్రభావంపై దృష్టి సారించగా, ఒవైసీ దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ రెండు భిన్నమైన స్పందనలు కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ చర్చకు కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
