పలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాటిని దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఈడీ అరెస్ట్ చేసింది. రతుల్ పురిపై రూ.354కోట్ల బ్యాంకు కుంభకోణం ఆరోపణలున్నాయి. మోసర్ బేర్ కంపెనీకి రతుల్ పురి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న సమయంలో.. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వాటిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే రుతుల్ పురితో పాటు మోసర్ బేర్ సంస్థకు చెందిన మరో నలుగురు డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆది, సోమవారాల్లో ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
కాగా, మోసర్ బేర్ అనేది డిజిటల్ డేటా స్టోరేజ్ రంగంలో సేవలు అందించింది. సీడీలు, డీవీడీలు, స్టోరేజ్ డివైజ్‌లపే ఈ కంపెనీ తయారుచేసేది. అయితే బ్యాంకుల కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో గతేడాది ఈ సంస్థ మూతపడింది. రతుల్ పురిపై అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ ముడుపులకు సంబంధించిన నగదు మోసర్ బేర్ సంస్థ ద్వారానే చేతులు మారిందని విచారణలో తేలింది. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ.. విచారణకు హాజరుకాని కారణంగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపింది.
మరోవైపు తన మేనల్లుడు రతుల్ పూరి అరెస్టు విషయంపై మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ స్పందించారు. అతని వ్యాపార లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రతుల్ అరెస్ట్‌పై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇన్విస్టిగేషన్ సంస్థలు తమ పని తాము నిజాయితీగా చేసుకోవచ్చని పేర్కొన్నారు.