Nita Ambani: ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి.. న్యూయార్క్‏లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంట్రల్ ఇండియా వీకెండ్..

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC).. భారతదేశంలోని ముంబైలో నీతా అంబానీ ప్రారంభించిన సాంస్కృతిక ప్రదర్శన స్థలం. 2023 మార్చి 31న దీనిని నీతా అంబానీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారతీయ కలలను పరిరక్షించడానికి.. ప్రోత్సహించడానికి ఈ కేంద్రాన్ని రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ స్థాపించారు.

Nita Ambani: ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి.. న్యూయార్క్‏లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంట్రల్ ఇండియా వీకెండ్..
Nita Ambani

Updated on: May 22, 2025 | 9:57 PM

భారతీయ కళలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రారంభించిన కల్చరల్ యాక్టివిటీస్ సెంటర్ “నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) “. దీనిని 2023 మార్చి 31న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్ కాంప్లెక్స్ లో స్థాపించారు. ఇక ఇప్పుడు ఎన్ఎమ్ఏసీసీ ‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 14 వరకు న్యూయార్క్ నగరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం భారతదేశ గొప్ప కళ, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. లింకన్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో నిర్వహించనున్న ఈ ఇండియా వీకెండ్ మొదటి ఎడిషన్ తో అంతర్జాతీయంగా ఒక మైలురాయి అరంగేట్రం చేయనుంది. మూడు రోజుల ఈ కార్యక్రమంలో సంగీతం, థియేటర్, ఫ్యాషన్, వంటకాలు వంటి వివిధ భారతీయ కళారూపాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.

మూడు రోజుల వేడుకలో ముఖ్యమైనది ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్ : సివిలైజేషన్ టు నేషన్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద థియేట్రికల్ ప్రొడక్షన్. ఇందులో దాదాపు 100 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీరిలో టోనీ, ఎమ్మీ పురస్కారాలు గెలుచుకున్న కళాకారులు సైతం ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి NMACC వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు నీతా అంబానీ మాట్లాడుతూ “నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్ మొదటిసారిగా న్యూయార్క్ నగరంలో జరుగుతుందని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం సంగీతం, నృత్యం, ఫ్యాషన్, వంటకాలు వంటి వివిధ భారతీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదిక పై ప్రదర్శిస్తున్నాము. భారతదేశంలోని ప్రపంచంలోని అత్యుత్తమ కళలను ప్రదర్శించడం, భారతదేశపు అత్యుత్తమ కళలను ప్రపంచానికి ప్రదర్శించడమే NMACC ప్రధాన లక్ష్యం. న్యూయార్క్ లో జరిగే ఈ మూడు రోజుల వేడుక మా ప్రయాణంలో మొదటి అడుగు అవుతుంది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక వేదికలలో ఒకటైన లింకన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. న్యూయార్క్ నగరంతోపాటు ప్రపంచంతో మా గొప్ప వారసత్వం, సంస్కృతిని పంచుకోవడానికి నేను మరింత ఉత్సాహంగా ఉన్నాను ” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ‘గ్రాండ్ స్వాగత్’ అని పిలువబడే ఆహ్వానితులకే పరిమితమైన రెడ్ కార్పెట్ ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలోని ఫ్యాషన్ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన భారతీయ సాంప్రదాయ దుస్తులను ప్రదర్శించనున్నారు. అలాగే మిచెలిన్-స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా నేతృత్వంలోని భారతీయ పురాతన, ఆధునిక వంటకాలను ప్రదర్శిస్తారు. అలాగే డామ్రోష్ పార్క్‌లో వారాంతంలో జరిగే ‘గ్రేట్ ఇండియన్ బజార్’, భారతీయ వస్త్రాలు, చేతిపనులు, వెల్నెస్ ప్రదర్శన కలల అనుభవాలను అందిస్తుంది. ఇక సంగీత ప్రదర్శనలో వెల్నెస్ నిపుణుడు ఎడ్డీ స్టెర్న్ నేతృత్వంలోని యోగా వర్క్‌షాప్‌లు, షియామక్ దావర్ బృందంతో డ్యాన్స్ సెషన్స్, శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్, పార్థివ్ గోహిల్, రిషబ్ శర్మల లైవ్ పర్ఫార్మెన్స్ ఉండనుంది. అలాగే ఫూలోన్ కి హోలీ, రెట్రో నైట్స్, డీజే సెట్ తో ఈ కార్యక్రమం ముగియనుంది.